బీహార్ రాష్ట్రంలో రోహ్తాస్ జిల్లాలో ఒక వ్యాన్ డ్యాంలో పడిపోయింది. అందులో ప్రయాణిస్తున్న 26 మంది యాత్రికుల్లో ఏడుగురు మునిగిపోయారు. మిగతా 19 మంది గాయపడ్డారు.కరకట్ ప్రాంతం పరిధిలోని పలు గ్రామాలకు చెందిన 26 మంది యాత్రికులు మహాశివరాత్రి కోసం కైమూర్ కొండలపై ఉన్న గుప్తేశ్వర్ మహాదేవ్ గుహ ఆలయానికి వ్యాన్‌లో బయలుదేరారు.
శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో గైఘాట్ కొండపైకి ఆ వ్యాన్ ఎక్కుతుండగా బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో అదుపుతప్పిన ఆ వాహనం 70 అడుగుల లోతున్న దుర్గావతి రిజర్వాయర్ ప్రాజెక్ట్ (డీఆర్‌పీ) డ్యాంలో పడింది.40 అడుగుల లోతు వరకు నీటితో ఉన్న ఆ డ్యాంలో వ్యాన్‌తోపాటు ఏడుగురు యాత్రికులు మునిగిపోయారు.
గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురి మృతదేహాలను వెలికి తీశారు. మరో నలుగురితోపాటు వ్యాన్ జాడ లభించలేదు. మిగతా 19 మంది యాత్రికులు గాయపడ్డారు. వారిని ససారంలోని సదర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.