Patna, November 17: బీహార్‌లోని ఖగారియా జిల్లాలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 23 మంది మహిళలకు అనస్థీషియా లేకుండానే (Without Anaesthesia) వైద్యులు, వైద్య సిబ్బంది.. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ (ట్యూబెక్టమీ) (23 Women Forced To Undergo Tubectomy) నిర్వహించారు.అలౌలి బ్లాక్‌లోని పిహెచ్‌సిలో జరిగిన ఈ సంఘటనపై ఖగారియా జిల్లా మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు. వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాలని సివిల్ సర్జన్‌ను కోరారు.
ఓ ఎన్జీవో ఆధ్వర్యంలో ట్యూబెక్టమీ నిర్వహించేందుకు 30 మంది మహిళలను పీహెచ్‌సీకి తీసుకురాగా, మొదట 23 మందికి వైద్యులు ఆపరేషన్ చేశారు. వీరి అరుపులు విని మిగతా ఏడుగురు పారిపోతూ స్థానికులకు సమాచారం అందించారు. హెల్త్ సెంటర్‌లోని ఆరోగ్య సిబ్బంది తమను గట్టిగా పట్టుకోగా, వైద్యులు ట్యూబెక్టమీ నిర్వహించినట్టు బాధిత మహిళలు స్థానిక మీడియాకు తెలిపారు. తీవ్రమైన నొప్పితో ఏడుస్తూ..కేకలు పెట్టినట్టు పేర్కొన్నారు. అయినా వైద్యులు వినకుండా నలుగురు వ్యక్తులు నా చేతులు మరియు కాళ్ళను గట్టిగా పట్టుకున్నారు.
నేను నొప్పితో అరుస్తున్నా డాక్టర్ పని పూర్తి చేశారని బాధితుల్లో ఒకరు తెలిపారు. ఇది తీవ్రమైన వైద్యపరమైన నిర్లక్ష్యం కేసు. అనస్థీషియా లేకుండా మహిళలను బలవంతంగా శస్త్ర చికిత్స ఎలా చేయిస్తారు? ట్యూబెక్టమీకి స్థానిక అనస్థీషియాను ఉపయోగించడం ప్రామాణిక పద్ధతి. దీనిపై విచారణ జరుగుతోంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఖగారియా జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు.