New Delhi, September 15: కరోనా మహమ్మారి ( Corona pandemic ) కారణంగా ఇప్పటివరకూ కంపెనీలకే పరిమితమైన జీతాల కోత ఇప్పుడు పార్లమెంట్ కు కూడా పాకింది. ఎంపీల జీతాల్లో 30 శాతం కోత విధించే బిల్లును లోక్ సభ ఆమోదించింది. వైరస్ పై పోరాటానికి నిధులను సమకూర్చడానికి ఏడాది పాటు ఎంపీల జీతాల్లో 30 శాతం కోతను (Bill to Cut MPs' Salaries by 30%) విధించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఏప్రిల్ 6న ఈ ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన బిల్లును ఇవాళ( మంగళవారం, సెప్టెంబర్-15) లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు సభలో ఆమోదముద్ర పడింది.
మరోవైపు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా వేతనాల కోతకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. మరోవైపు… ఎంపీ లాడ్స్ నిధులను కూడా రెండేళ్ల పాటు నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కరోనా సాకుపెట్టి రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జీఎస్టీ బకాయిలను చెల్లించలేమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఏప్రిల్ నుంచి ఏడాది పాటు ఎంపీలో వేతనాల్లో కోత పడనుంది.
దీనికి సంబంధించిన ఆర్డినెన్స్‌ను ఏప్రిల్ 7న కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ఆర్డినెన్స్ కాలపరిమితి ఆరు నెలలు మాత్రమే కావడంతో పార్లమెంట్ ఆమోదంతో చట్ట సవరణ తప్పనిసరి. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఎంపీ ల్యాండ్స్ నిధులు కూడా రెండేళ్ల పాటు తాత్కాలికంగా రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.