Rajnath Singh on Border Tensions: చైనా మొండిగా వ్యవహరిస్తోంది, శాంతియుతంగానే సమస్య పరిష్కారం కావాలి, దేశ రక్షణ విషయంలో రాజీ పడేది లేదని తెలిపిన ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌
Defence Minister Rajnath Singh in Lok Sabha | (Photo Credits: ANI)

New Delhi, September 15:  భారత్‌-చైనా సరిహద్దు సమస్యపై పార్లమెంట్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh on Border Tensions) మంగళవారం ప్రకటన చేశారు. దేశ ప్ర‌జ‌లంతా సైనికుల వెంటే ఉంటార‌ని ప్ర‌ధాని మోదీ ఆశాభావం వ్య‌క్తం చేసిన విష‌యాన్ని మంత్రి ఈ సంధర్భంగా గుర్తు చేశారు. సరిహద్దుల్లో పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయని సమస్య ఇంకా పరిష్కారం కాలేదని స్పష్టం చేశారు. మన బలగాలు దేశ గౌరవాన్ని ఇనుమడింపచేస్తున్నాయని, చైనా దూకుడుకు చెక్‌ పెట్టేందుకు భారత దళాలు అప్రమత్తంగా ఉన్నాయని మంత్రి చెప్పారు. చైనా మొండిగా వ్యవహరిస్తోందని, ఈ ఏడాది మే నుంచి సరిహద్దుల్లో భారీగా సాయుధ బలగాలను మోహరించిందని వివరించారు.

ఇటీవ‌లే తాను ల‌డాఖ్ వెళ్లిన‌ట్లు చెప్పిన ర‌క్ష‌ణ మంత్రి ( Rajnath Singh) సైనికుల‌ సాహ‌సం, శౌర్యాన్ని ప్ర‌త్య‌క్షంగా చూసాన‌ని, క‌ల్న‌ల్ సంతోష్‌బాబు మాతృభూమి సేవ‌లో ప్రాణ‌త్యాగం చేశార‌ని కొనియాడారు. 1950 నుంచి రెండు దేశాల మ‌ధ్య స‌రిహ‌ద్దు వివాదం నెల‌కొన్న‌ద‌ని అప్పటి నుంచి ఆ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌లేక‌పోయారన్నారు. ఇదో సంక్లిష్ట‌మైన స‌మ‌స్య అన్న మంత్రి.. శాంతియుతంగానే ఈ స‌మ‌స్య‌ను (Rajnath Singh Issues Statement on India-China Face-Off) ప‌రిష్క‌రించాల‌న్నారు. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు వాస్త‌వాధీన రేఖ వెంట శాంతి, సామ‌ర‌స్యం ముఖ్య‌మ‌ని అభిప్రాయ‌పడ్డారు. ఎల్ఏసీ వెంట శాంతి కోసం 1988 నుంచి రెండు దేశాల మ‌ధ్య సంబంధాల్లో అభివృద్ధి జ‌రిగిన‌ట్లు మంత్రి తెలిపారు.

విమానయాన రంగంలో సమూల మార్పులు, ఎయిర్‌క్రాఫ్ట్ స‌వ‌ర‌ణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం, బిల్లును స్వాగతించిన ప్రతిపక్షాలు

చైనాతో తాము స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటున్నా డ్రాగన్ మాత్రం‌ దూకుడుతో వ్యవహరిస్తోందని...దీంతో శాంతి ఒప్పందంపై ప్రభావం పడుతోందని, ద్వైపాక్షిక చర్చలపైనా ఇది ప్రతికూల ప్రభావం చూపుతోందని మంత్రి చెప్పారు. 1962లో చైనా లడ్డాఖ్‌లో 90 వేల కిలోమీటర్ల భూభాగం ఆక్రమించిందని అన్నారు. దేశ రక్షణ విషయంలో రాజీ పడేది లేదని రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్నామని చెప్పారు.

సరిహద్దుల నిర్ణయానికి చైనా అంగీకరించడం లేదని (India-China Tensions)..ఎల్‌ఏసీని ఇరు దేశాలు గౌరవించాలని అన్నారు. వాస్త‌వాధీన రేఖ‌(ఎల్ఏసీ)ను స‌రిగా మార్కింగ్ చేయ‌లేద‌ని చైనా భావిస్తున్న‌ట్లు మంత్రి చెప్పారు. ఎల్ఏసీ వ‌ద్ద ఉన్న ప‌రిస్థితి వ‌ల్ల రెండు దేశాల మ‌ధ్య సంబంధాలపై ప్ర‌భావం ప‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలిపారు. ఎల్ఏసీపై భార‌త్, చైనాల మ‌ధ్య భిన్నభిప్రాయాలు ఉన్నాయ‌ని, ఏప్రిల్ నుంచి వాస్త‌వాధీన రేఖ వెంట చైనా త‌మ బ‌ల‌గాల‌ను మోహ‌రిస్తున్న‌ట్లు ఆయ‌న  తెలిపారు. దౌత్య‌, సైనిక ప‌ద్ద‌తుల్లో చైనాకు భార‌త్ వార్నింగ్ ఇచ్చిన‌ట్లు రాజ్‌నాథ్ తెలిపారు.తాజాగా ఇరుదేశాల విదేశాంగ మంత్రులు అవగాహనకు వచ్చారని చెప్పారు.

ఇక చైనాతో ఉద్రిక్తతలపై పార్లమెంట్‌లో చర్చకు విపక్షాలు డిమాండ్‌ చేశాయి. ప్రతిపక్షాల డిమాండ్‌ను ప్రభుత్వం తోసిపుచ్చగా ఈ అంశంపై సభలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటన చేశారు. స‌రిహ‌ద్దు వెంట ఉన్న సున్నితత్వాన్ని స‌భ అర్థం చేసుకుంటుంద‌ని భావిస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు. సైనిక ద‌ళాల త్యాగాల‌ను ప్ర‌శంసించాల‌న్నారు. గ‌త కొన్నేళ్ల నుంచి స‌రిహ‌ద్దుల్లో మౌళిక స‌దుపాయాల‌ను పెంచుతున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

చైనా ద‌ళాలు హింసాత్మ‌క ధోర‌ణితో ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు ఆరోపించారు. ఘ‌ర్ష‌ణాత్మ‌క ప్రాంతాల్లో భార‌త్ కూడా త‌మ బ‌ల‌గాల‌ను మోహ‌రించిన‌ట్లు ఆయ‌న చెప్పారు. స‌రిహ‌ద్దును ర‌క్షించుకునేందుకు సైనిక ద‌ళాలు స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు మంత్రి తెలిపారు. సైనిక ద‌ళాల ప‌ట్ల గ‌ర్వంగా ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ప్ర‌స్తుత ద‌శ‌లో చాలా సున్నిత‌మైన అంశాలను వెల్ల‌డించ‌లేమ‌ని రాజ్‌నాథ్ తెలిపారు.