New Delhi, Sep 15: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రెండవరోజు వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. కీలక బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. రాజ్యసభలో ఎయిర్‌క్రాఫ్ట్ సవరణ బిల్లును (Aircraft Amendment Bill 2020) ప్రవేశపెడుతూ విమానయాన శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పురి (Aviation Minister puri) మాట్లాడారు.. విమానయాన రంగ రక్షణ విషయంలో ఎటువంటి లాలూచీ జరగలేదని..గత మూడేళ్లలో 1000 మంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లను రిక్రూట్ చేశామని మంత్రి తెలిపారు. ఇంకా ఖాళీలు మాత్రం 3500 ఉన్నాయని... కోవిడ్ (Coronavirus) వల్ల ప్రస్తుతం రిక్రూట్మెంట్ ప్రక్రియ మందగించిందన్నారు.
ప్రైవేటీకరణ వల్ల వచ్చిన 29వేల కోట్లను విమానాశ్రయాల అభివృద్ధికి వాడనున్నట్లు మంత్రి తెలిపారు. ముంబై, ఢిల్లీ విమానాశ్రయాలు 2006లో ప్రైవేటుపరం చేశారని, ఆ ఎయిర్‌పోర్ట్‌లు 33 శాతం ట్రాఫిక్‌ను, ఆదాయాన్ని కల్పిస్తున్నాయన్నారు. అయితే 2018లో ప్రైవేటీకరణ చేసిన ఆరు విమానాశ్రయాలతో కేవలం 9 శాతం ఆదాయం వస్తుందన్నారు. ఆ విమానాశ్రయాల కోసం ఓపెన్ బిడ్డింగ్‌కు వెళ్లినట్లు చెప్పారు. తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్ ప్రైవేటీకరణకు కేరళ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వలేదని, ఎందుకంటే మరో వేలందారుడి కన్నా 19 శాతం తక్కువ బిడ్డింగ్ వేసినట్లు మంత్రి తెలిపారు.
వందేభారత్ మిషన్ ద్వారా 16 లక్షల మంది భారతీయులను తరలించినట్లు చెబుతూ.. టికెట్ బుకింగ్ కోసం తొలి రోజు 36 లక్షల మంది ఎయిర్ ఇండియా వెబ్‌సైట్‌ను విజిట్ చేసినట్లు చెప్పారు. విమాన టికెట్ ధరలు కూడా ఇతరులతో పోలిస్తే చాలా తక్కువే అన్నారు. విమానాశ్రయాలను ప్రైవేటీకరించాలని లేదంటే మూసివేయాల్సి వస్తుందన్నారు. ఓటింగ్ తర్వాత ఎయిర్‌క్రాఫ్ట్ సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించింది.
ఎయిర్‌క్రాఫ్ట్ సవరణ బిల్లుపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ దినేశ్ త్రివేది బెంగాలీ భాషలో మాట్లాడుతూ.. రాజ్యసభలో తనకు మాట్లాడే అవకాశం కల్పించిన సీఎం మమతా బెనర్జీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత ఇంగ్లీష్‌లో మాట్లాడిన ఎంపీ.. వందేభారత్ మిషన్ చేపట్టిన కేంద్ర ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. వందేభారత్ మిషన్‌ను మెచ్చుకుంటున్నామంటే.. అది ఎయిర్ ఇండియా వల్లే అని, కోవిడ్ నేపథ్యంలో నిలిచిపోయిన ప్రయాణికులను ఎయిర్ ఇండియా తీసుకువచ్చిందని, ఎయిర్ ఇండియా లేకుంటే ప్రైవేటు విమాన రంగం ఇలాంటి సేవ చేసేది కాదన్నారు. ఎయిర్ ఇండియాను అమ్మవద్దు అంటూ దినేశ్ త్రివేది కేంద్రాన్ని కోరారు. ఎయిర్ ఇండియా హైతో.. హిందుస్తాన్ హై అని తెలిపారు. స్వయంగా పైలట్ అయిన త్రివేది మాట్లాడుతూ.. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్ట్‌ను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఎయిర్‌క్రాఫ్ట్ సవరణ బిల్లును స్వాగతిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఎయిర్‌క్రాఫ్ట్ సవరణ బిల్లు చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మాట్లాడారు. ఫ్లయిట్ సెక్యూర్టీ ఆఫీసర్ల కొరత వల్ల ప్రమాదాలు జరుగుతున్నట్లు చెప్పారు. ఇటీవల కేరళలోని కరీపూర్‌లో జరిగిన విమాన దుర్ఘటన గురించి మాట్లాడారు. ఇప్పటికి కూడా ఆ విమాన ప్రమాదానికి కారణం తెలియలేదన్నారు. టేబుల్ టాప్ విమానాశ్రయాలపై అతిపెద్ద విమానాలను నడిపిస్తున్న తీరు పట్ల ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. విమానాశ్రయాల ప్రైవేటీకరణపై కూడా వేణుగోపాల్ ప్రభుత్వాన్ని తప్పుపట్టారు.
ఈ సంధర్భంగా కేవలం అదానీ గ్రూపుకు ఆరు బిడ్లు ఎలా దక్కాయని ఆయన ప్రశ్నించారు. అదానీకి అనుకూలించే విధంగా షరతులను మార్చేశారా అని ఆయన నిలదీశారు. డీఈఏ, నీతిఆయోగ్ ఇచ్చిన ప్రతిపాదనలనే కేంద్ర ప్రభుత్వం విస్మరించినట్లు ఆయన ఆరోపించారు. భారతీయ విమానాశ్రయాలను గుత్తాధీపత్యంలోకి తీసుకువెళ్తున్నట్లు విమర్శించారు. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) రానున్న రోజుల్లో ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ అదానీగా మారుతుందని కాంగ్రెస్ ఎంపీ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం పట్టించుకోవడం లేదని, అదానీలకు కాంట్రాక్టు ఇవ్వడం పట్ల దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు
చెన్నై ఒక మెట్రోపాలిటన్ నగరమని, కానీ ఢిల్లీ లేదా హైదరాబాద్ తరహాలో అంతర్జాతీయ విమానాశ్రయం అక్కడ లేదని డీఎంకే ఎంపీ పీ విల్సన్ తెలిపారు. చెన్నైలో ఉన్న విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లు అభివృద్ధి చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ప్రతి ఏడాది కేవలం 5 శాతం మంది మాత్రమే విమానాల్లో ప్రయాణిస్తారని, ఆ సంఖ్య ఒకవేళ 15 శాతానికి పెరిగితే, అప్పుడు విమానాలు, విమానాశ్రయాల సంఖ్య పెంచాల్సి ఉంటుందన్నారు. కోవిడ్19 వల్ల ఎయిర్‌లైన్స్ ఆర్థికంగా దెబ్బతిన్నాయని, కేంద్రం విమాన సంస్థలను ఆదుకోవాలని ఎన్‌సీపీ ఎంపీ ప్రఫుల్ పటేల్ తెలిపారు.
నిన్నటి సమావేశాల్లో.. బాలీవుడ్‌లో డ్రగ్స్ వినియోగం విపరీతంగా ఉందని భోజ్‌పూరి నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్ పార‍్లమెంటులో వ్యాఖ్యానించడంపై సమాజ్‌వాది పార్టీ ఎంపీ జయాబచ్చన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎవరో కొందరు చేసిన పనికి బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని విమర్శించడం తగదని మండిపడ్డారు. మంగళవారం రాజ్యసభలో మాట్లాడిన జయాబచ్చన్.. ‘కొంతమంది వ్యక్తుల కారణంగా పరిశ్రమను కించపర్చడం సరికాదన్నారు. బాలీవుడ్‌కు చెందిన వ్యక్తే సోమవారం లోక్‌సభలో ఆ పరిశ్రమ ప్రతిష్టను దిగజార్చేలా వ్యాఖ్యలు చేయడంతో తాను సిగ్గుపడ్డానని జయాబచ్చన్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు వింటే అన్నం పెట్టిన చేతినే నరుక్కున్నట్లుగా ఉందని ఆమె విమర్శించారు. బాలీవుడ్‌లో మత్తు పదార్థాల అక్రమ రవాణా, వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని ఎంపీ రవికిషన్ సోమవారం లోక్‌సభలో వ్యాఖ్యానించారు.
దేశ యువతను నాశనం చేయటానికి కుట్ర జరుగుతున్నదని ఆయన ఆరోపించారు. దేశంలో మత్తు పదార్థాలు సరఫరా చేస్తూ యువతను పెడదోవ పట్టిస్తున్న వారికి పొరుగుదేశాలు సహకారం అందిస్తున్నాయని ఎంపీ రవికిషన్ పేర్కొన్నారు. పాకిస్తాన్, చైనాలనుంచి ప్రతి ఏటా మత్తు పదార్థాలు దేశంలోకి అక్రమంగా రవాణా అవుతున్నాయని తెలిపారు. నేపాల్, పంజాబ్ సరిహద్దుల ద్వారా దేశంలోకి డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని చెప్పారు. అయితే, ఆయన బాలీవుడ్‌ను నిందించడంపై జయాబచ్చన్ తీవ్రంగా పరిగణించారు.
కాగా కోవిడ్ నిబంధనల నేపథ్యంలో సరికొత్త విధి, విధానాలతో ఉభయసభలు మొదటిరోజు వేర్వేరు సమయాల్లో సమావేశమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. ప్రజాస్వామ్యాన్ని, సభ్యుల వాణిని అణచి వేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించాయి. కోవిడ్ కారణంగా ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేస్తూ లోక్‌సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అయితే, సభ్యులు లేవనెత్తే అన్ని ప్రశ్నలకు సమాధానాలిస్తామని ప్రభుత్వం తెలిపింది