Bareli, NOV 24: జీపీఎస్ నావిగేషన్ మ్యాప్ తప్పుగా చూపించడంతో నిర్మాణంలో ఉన్న వంతెన పైనుంచి కారు కింద పడింది. (Car Falls From Bridge) అందులో ప్రయాణించిన ముగ్గురు వ్యక్తులు ఈ ప్రమాదంలో మరణించారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ (Bareilly) జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కొందరు వ్యక్తులు బరేలీ నుంచి బదౌన్ జిల్లాలోని డేటాగంజ్‌కు కారులో వెళ్తున్నారు. ఆదివారం ఉదయం పది గంటల సమయంలో ఖల్పూర్-దతాగంజ్ రహదారిపై ఆ కారు వేగంగా ప్రయాణించింది. కాగా, నావిగేషన్ పొరపాటు వల్ల నిర్మాణంలో ఉన్న వంతెనపైకి ఆ కారు దూసుకెళ్లింది. దీంతో వంతెన పైనుంచి కింద ఉన్న రామగంగా నదిలో (Rama Ganga) అది పడింది. ఆ కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను కారు నుంచి బయటకు తీశారు. పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు, కొన్ని నెలల కిందట భారీ వరదల కారణంగా నిర్మాణంలో ఉన్న వంతెన ముందు భాగం నదిలో కూలిపోయిందని పోలీసులు తెలిపారు. దీని గురించి జీపీఎస్‌లో మార్పు చేయకపోవడంతో నావిగేషన్ మ్యాప్‌లో తప్పుగా చూపించిందని చెప్పారు. అలాగే ఆ వంతెన ప్రవేశం వద్ద ఎలాంటి సూచనలు, హెచ్చరికలు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఆ కారు తప్పుదారి పట్టిందని, వంతెన పైనుంచి కింద ఉన్న నదిలో పడిందని వెల్లడించారు.