Indian Parliament (Photo credits: Wikimedia Commons)

New Delhi, September 16: పార్లమెంటు కొత్త భవన నిర్మాణ కాంట్రాక్ట్‌ను (New Parliament Building Contract) టాటా గ్రూప్‌కు చెందిన టాటా ప్రాజెక్ట్స్ దక్కించుకుంది.ఆర్థిక బిడ్స్‌లో బుధవారం ఎల్‌అండ్‌టీతో పోటీ పడి టాటా ప్రాజెక్ట్స్‌ పార్లమెంట్‌ నూతన భవన నిర్మాణ కాంట్రాక్టును చేజిక్కించుకుంది. ఈ ప్రాజెక్టును 861.90 కోట్ల రూపాయలతో పూర్తి చేయనున్నట్టు టాటా ప్రాజెక్ట్‌ పేర్కొంది. నూతన పార్లమెంటు భవన నిర్మాణానికి (Central Vista Re-Development) సంబంధించి అర్హత కలిగిన పలు కంపెనీల నుంచి కేంద్ర ప్రజా పనుల శాఖ(CPWD) బిడ్స్‌ను స్వీకరించింది. తుది బిడ్స్‌ను సెప్టెంబర్ 16న(బుధవారం) సీపీడబ్ల్యూడీ అధికారులు తెరిచారు.

టాటా ప్రాజెక్ట్స్‌కు దీని నిర్మాణానికి టాటా ప్రాజెక్ట్స్ (tata projects) అతి తక్కువగా రూ.861.90 కోట్లకు బిడ్డింగ్ చేసింది. దీంతో నూతన పార్లమెంటు నిర్మాణ కాంట్రాక్ట్‌ను ఆ సంస్థకు ఖరారు చేశారు. టాటా ప్రాజెక్ట్స్ తర్వాత అతి తక్కువగా లార్సన్ అండ్ టుబ్రో(ఎల్ అండ్ టీ) రూ.865 కోట్లకు బిడ్డింగ్ చేసింది. కేవలం రూ.4.10 కోట్లతో ఎల్ అండ్ టీ ఈ ప్రాజెక్టును చేజార్చుకుంది. కాగా, పార్లమెంట్ భవన నిర్మాణాన్ని ఏడాదిలో పూర్తి చేయనున్నట్లు సమాచారం. త్రిభుజాకారంలో నిర్మించనున్న ఈ భవనానికి మొత్తంగా 940 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని ప్రభుత్వ ప్రజా పనుల శాఖ అంచనా వేసింది.

ఇండియాకు త్వరలో రష్యా స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్, ఆర్‌డీఎఫ్ తో భారీ డీల్ కుదుర్చుకున్న డా.రెడ్డీస్ ల్యాబ్, పదికోట్ల మోతాదుల కోవిడ్-19 వ్యాక్సిన్‌ ఉత్పత్తికి రెడ్డీస్ ల్యాబ్ రెడీ

పలు కంపెనీలు పార్లమెంటు నూతన భవన నిర్మాణం కోసం బిడ్డింగ్స్ సమర్పించాయి. గత నెల వీటిని పరిశీలించిన అధికారులు...బిడ్డింగ్స్ సమర్పించిన వాటిలో మూడు సంస్థలు టాటా ప్రాజెక్ట్స్, లార్సన్ అండ్ టుబ్రో, షాపోర్జి పలోంజి అండ్ కంపెనీలను తుది బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు ఎంపిక చేశారు.ప్రస్తుత పార్లమెంటు భవనానికి సమీపంలోనే కొత్త భవన నిర్మాణాన్ని చేపట్టనున్నారు.

21 మాసాల వ్యవధిలో ఈ నిర్మాణ పనులను పూర్తిచేయాల్సి ఉంటుంది. రూ.889 కోట్ల వ్యయంతో నిర్మించాలని భావిస్తున్నట్లు ప్రీ-బిడ్డింగ్ అర్హతకు సంబంధించిన నోటీసులో స్పష్టంచేశారు. పార్లమెంటు హౌస్ ఎస్టేట్‌లోని ప్లాట్ నెం.118లో పార్లమెంటు కొత్త భవనాన్ని నిర్మించనున్నారు. బిడ్డింగ్ ప్రక్రియ పూర్తికావడంతో టాటా ప్రాజెక్ట్స్ త్వరలోనే పార్లమెంటు కొత్త భవన నిర్మాణ పనులను ప్రారంభించే అవకాశముంది.

బ్రిటిష్‌ కాలంలో నిర్మించిన ప్రస్తుత భవనానికి మరమ్మత్తులు చేసిన అనంతరం ఇతర అవసరాల కోసం వినియోగించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, పార్లమెంట్‌ నూతన భవన నిర్మాణానికి సంబంధించి ఈ ఏడాది ఆరంభంలోనే ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. గ్రౌండ్‌ ఫ్లోర్‌తో పాటు రెండు అంతస్తులు త్రిభుజాకార భవనంగా దీన్ని నిర్మాణం చేపట్టనున్నారు. ప్రస్తుత పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాత నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్టు సమాచారం.

నూతన పార్లమెంట్‌ భవనంపై భారత జాతీయ చిహ్నం ముద్రిస్తారని తెలిసింది. పార్లమెంట్‌ హౌస్‌ ఎస్టేట్‌లోని 118వ నెంబర్‌ ప్లాట్‌లో 60,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నూతన భవనం కొలువుతీరనుంది. సెంట్రల్‌ విస్టా రీడెవలప్‌మెంట్‌లో భాగంగా తొలి ప్రాజెక్టుగా పార్లమెంట్‌ నూతన భవన నిర్మాణాన్ని చేపట్టనున్నారు