Visakhapatnam, May 7: విశాఖపట్నంలోని ఆర్.ఆర్. వెంకటాపురం పరిధిలో గల ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ ( LG Polymers industry) నుంచి గురువారం ఉదయం రసాయన గ్యాస్ లీకేజీ సంభవించింది. ఈ గ్యాస్ పీల్చడం ద్వారా ముగ్గురు మృతిచెందారు, అందులో ఒక చిన్నారి కూడా ఉంది. అంతేకాకుండా స్థానికంగా నివసించే వందల మంది అస్వస్థతకు గురయ్యారు.
నివేదికల ప్రకారం, తెల్లవారుఝామున 3 గంటల సమయంలో ఈ రసాయన వాయువు లీక్ అయినట్లుగా తెలుస్తుంది. చుట్టుప్రక్కల సుమారు 5 కిలోమీటర్ల వరకు ఈ వాయువు వ్యాపించింది. ఈ రసాయన వాయువు ఘాటుగా ఉండటం, అప్పటికీ అందరూ ఘాడ నిద్రలో ఉండటంతో చాలా మంది ఈ వాయువు పీల్చిన వారు ఒక్కసారిగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొన్నారు.
అంతేకాకుండా కళ్లు మండటం మరియు కనిపించకపోవడం, చర్మంపై దద్దుర్లు రావడం, సొమ్మసిల్లి పడిపోవడం కూడా జరిగాయి. ఏం జరుగుతుందో తెలియని ఆందోళనలో చాలా మంది ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కళ్లు కనిపించక ఓ వ్యక్తి బావిలో పడిపోయి మృతి చెందాడు.
Three dead, Including One Child Due to Gas Leakage:
#UPDATE 3 persons, including one child, dead after chemical gas leakage at LG Polymers industry in RR Venkatapuram village, Visakhapatnam: District Medical & Health Officer (DMHO). #AndhraPradesh https://t.co/sEx1YdgeOZ
— ANI (@ANI) May 7, 2020
మనుషులే కాదు, ఈ గాలి పీల్చిన వందలాది పశువులు కూడా నురగలు కక్కుతూ పడిపోయాయి. ఈ గ్యాస్ ప్రభావంతో పచ్చని చెట్ల ఆకులు కూడా రంగు మారాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ టెండర్లు, అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఇంతకాలం లాక్డౌన్ కారణంగా మూసివేయబడే ఉన్న ఈ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ, ఆంక్షల సడలింపుతో తిరిగి ప్రారంభించే క్రమంలో గ్యాస్ లీకేజ్ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనావేస్తున్నారు. లీకైంది 'స్టిరీన్ గ్యాస్' అని అధికారులు పేర్కొన్నారు. త్వరలో ప్రజా రవాణాను ప్రారంభమవుతోంది, కొద్ది రోజుల్లో కీలక నిర్ణయం వెల్లడిస్తామని తెలిపిన కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ
కాగా, ఎల్‌జీ పాలిమర్స్ నుంచి రసాయన గ్యాస్ లీకైన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి (CM YS Jagan) జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి ఆరా తీశారు. తక్షణమే సహాయ కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. రసాయన వాయువు విడుదలైన బాధిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.