Raipur, Mar 7: ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం ఆత్మహత్య పాల్పడిన విషాద ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. పటాన్ పోలీసు స్టేషన్ పరిధిలోని బతెనా గ్రామానికి చెందిన రామ్ బ్రిజ్ గైక్వాడ్(52), జానకి బాయి(47) దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుమారుడు సంజు(24), కూతుర్లు దుర్గ(28), జ్యోతి(21) ఉన్నారు. అయితే ఈ కుటుంబాన్ని గత కొంతకాలం నుంచి ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన గైక్వాడ్ కుటుంబం ఆత్మహత్యకు (Five members of family found dead) పాల్పడింది.
గైక్వాడ్, సంజు ఉరి వేసుకోగా, మిగతా ముగ్గురు నిప్పంటించుకుని సూసైడ్ చేసుకున్నారు. ఘటనాస్థలిలో లభ్యమైన సూసైడ్ నోట్‌లో ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు ఉంది. గైక్వాడ్ ఇంటికి చేరుకున్న పోలీసులు.. ఐదుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం దుర్గ్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కుటుంబం ఆత్మహత్యపై పూర్తి స్థాయి విచారణ జరిపేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ఛత్తీస్‌గఢ్ హోంమంత్రి సాహూ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఇక జార్ఖండ్ రాష్ట్రం పలాము జిల్లాలో గర్భందాల్చిన బాలికను ఆమె ప్రియుడు హత్య చేసి స్నేహితుడి సహాయంతో పూడ్చిపెట్టాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు. కొరియాదిహ్ గ్రామానికి చెందిన 17 ఏండ్ల బాలిక, 18 ఏండ్ల యువకుడు ప్రేమించుకున్నారు. ఆ బాలిక ప్రెగ్నెంట్ కావడంతో పెండ్లి చేసుకోవాలని ఆ యువకుడ్ని ఒత్తిడి చేసింది. అయితే ఆమె ప్రియుడు అబార్షన్ కోసం ఒక నర్సును సంప్రదించగా పది వేలు అడిగింది.
అంత డబ్బు లేకపోవడంతో ప్రియురాలిని హత్య చేయాలని అతడు నిర్ణయించుకున్నాడు. ఫిబ్రవరి 21న ఆమెను గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో పొడిచి చంపాడు. అనంతరం స్నేహితుడి సహాయంతో ఆమె మృతదేహాన్ని సోన్ నది తీరంలో పూడ్చిపెట్టాడు. బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రుల ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు ఫిబ్రవరి 27న ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఆమె ప్రియుడితోపాటు సహకరించిన స్నేహితుడ్ని అరెస్ట్ చేశారు.