Hyderabad, November 28: సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన ప్రగతి భవన్ లో గురువారం నిర్వహించిన మంత్రివర్గం సమావేశం (Cabinet Meet) ముగిసింది. ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు.
ఒక తెలంగాణ బిడ్డగా, బాధ్యత గల ముఖ్యమంత్రిగా మరోసారి చెప్తున్నా, ఆర్టీసీ కార్మికులందరూ మా బిడ్డలే. రేపట్నించి కార్మికులందరూ విధులకు హాజరుకావొచ్చు. ఎలాంటి షరతులు పెట్టబోం. అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
మాది పొట్టలు నింపే ప్రభుత్వం కానీ, ఎవరి పొట్టలు కొట్టే ప్రభుత్వం కాదు. ఆశ వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, ట్రాఫిక్ పోలీసులకు, ఆర్టీసీ కార్మికులతో సహా దేశంలో ఎక్కడా లేని విధంగా జీతాలు ఇస్తున్నాం అని చెప్పారు. సమ్మె (TSRTC Strike) కారణంగా ఆత్మహత్య చేసుకున్న కార్మికుల పట్ల కూడా సీఎం స్పందించారు. ఆ కార్మికుల కుటుంబాలందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ హామి ఇచ్చారు.
యూనియన్ల కారణంగానే ఆర్టీసీ కార్మికులు దెబ్బతిన్నారు. రాష్ట్రంలో రాజకీయ నిరుద్యోగులుగా ఉన్న ప్రతిపక్ష పార్టీల నేతలే జబ్బలు చరుస్తూ కార్మికులను రోడ్డున పడేశారు. కార్మికులకు లేని భరోసా, ఆశలు కల్పించారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.
అయితే యూనియన్లను, యూనియన్ లీడర్లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోం అని సీఎం కేసీఆర్ ఖరాఖండీగా చెప్పారు. వారితో ఇకపై ఎలాంటి సంప్రదింపులూ జరపమని సీఎం తేల్చిచెప్పారు.
కార్మికులకు ఏదైనా సమస్య వస్తే యూనియన్లకు బదులు, ప్రతీ డిపో నుంచి ఇద్దరు కార్మికులతో ఒక 'వేల్ఫేర్ కౌన్సిల్' అధికారికంగా ఏర్పాటు చేస్తాం, అందుకు ఒక మంత్రి బాధ్యత వహిస్తారు అని కేసీఆర్ అన్నారు. కాబట్టి భవిష్యత్తులో ఎలాంటి సమస్య ఎదురైనా, తక్షణమే పరిష్కరించే వీలు కలుగుతుందని చెప్పారు.
తక్షణ సాయంగా ఆర్టీసీకి రూ. 100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. అలాగే సంస్థను బ్రతికించుకోవడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో బస్సు ఛార్జీలు పెంచాల్సి వస్తుందని తెలిపారు. కి.మీకు 0.20 పైసల చొప్పున ఈ సోమవారం నుంచే టికెట్ ధరలు పెంచుకోవచ్చునని ఆర్టీసీ యాజమాన్యానికి సీఎం కేసీఆర్ సూచించారు. దీని ద్వారా రూ. 750 కోట్లు ఆదాయం పెరిగే అవకాశం ఉందని సీఎం తెలిపారు. కాగా, కార్మికుల జీతాల పట్ల సీఎం కేసీఆర్ ఎలాంటి ప్రకటన చేయలేదు. కార్మికులు కోరితే దానిపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
మరోవైపు, ఇన్నాళ్ల సమ్మె కాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వానికి సహకరించినందుకు ఆర్టీసీ తాత్కాలిక సిబ్బందికి సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. వారిని కూడా తగిన సమయంలో ఆదుకునే ప్రయత్నం చేస్తామని, ప్రత్యామ్నాయ మార్గాలు చూపుతామని సీఎం హామి ఇచ్చారు.