KCR Full-fledged Cabinet: పూర్తిస్థాయిలో మంత్రివర్గ విస్తరణ చేసిన సీఎం కేసీఆర్. హరీశ్ రావుకు కీలక శాఖ, కేటీఆర్ కు గతంలో నిర్వహించిన శాఖలే. కొన్ని కీలక శాఖలను తన వద్దే ఉంచుకున్న సీఎం.
కొత్తగా కొలువుదీరిన మంత్రివర్గం ఇదే!

Hyderabad: తెలంగాణ రాష్ట్రానికి నూతన గవర్నర్ గా తమిళిసై సౌందరరాజన్ ఆదివారం ఉదయం బాధ్యతలు స్వీకరించిన వెంటనే అదే రోజు సాయంత్రానికి సీఎం కేసీఆర్ పూర్తి స్థాయిలో తన కేబినేట్ ను విస్తరించారు. ఆపై సోమవారం నుంచి బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సి ఉన్న నేపథ్యంలో ఆదివారం రాత్రే బడ్జెట్ పై సీఎం కేసీఆర్ కేబినేట్ మీటింగ్ నిర్వహించి తాను ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ కు కేబినేట్ ఆమోదం తీసుకుని ఈరోజు బడ్జెట్ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఒకసారి ఈ మంత్రివర్గ విస్తరణ గురించి చెప్పాలంటే హరీశ్ రావు, కేటీఆర్ సహా మొత్తంగా 6 గురికి మంత్రులుగా అవకాశం ఇచ్చారు కేసీఆర్. తొలిసారిగా తన కేబినేట్ లో ఇద్దరు మహిళలకు స్థానం ఇచ్చారు. వారందరికీ శాఖలను సైతం కేటాయించారు. పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొంత మంది మంత్రుల శాఖల్లో మార్పులు కూడా జరిగాయి. గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీశ్ రావుకు ఈసారి కీలకమైన ఆర్థిక శాఖ కేటాయించారు. ఇక కేటీఆర్ కు మాత్రం గతంలో కేటాయించిన శాఖలనే మళ్ళీ అవే ఈసారి కూడా కేటాయించారు.

కొత్తగా కొలువుదీరిన మంత్రులు, వారికి కేటాయించిన శాఖలు.

తన్నీరు హరీశ్ రావు (ఎమ్మెల్యే, సిద్ధిపేట) -- ఆర్థిక శాఖ

కల్వకుంట్ల తారక రామారావు (ఎమ్మెల్యే, సిరిసిల్ల)-- ఐటీ, పరిశ్రమలు మరియు పురపాలక శాఖలు.

పటోళ్ల సబిత ఇంద్రారెడ్డి (ఎమ్మెల్యే, మహేశ్వరం) -- విద్యా శాఖ

పువ్వాడ అజయ్ కుమార్ (ఎమ్మెల్యే, ఖమ్మం) - రవాణా శాఖ

గంగుల కమలాకర్ (ఎమ్మెల్యే, కరీంనగర్)-- బీసీ సంక్షేమం, పౌర సరఫరాలు

సత్యవతి రాథోడ్ (ఎమ్మెల్సీ, వరంగల్) -- స్త్రీ మరియు శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖలు

కొత్తగా కొలువుదీరిన ఈ ఆరుగురు మంత్రుల చేత గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదివారం రోజు ప్రమాణ స్వీకారం చేయించారు. తాజా విస్తరణతో కేసీఆర్ కేబినేట్ లో మంత్రుల సంఖ్య 18కి చేరింది. కాగా, సాధారణ పరిపాలన, ప్రణాళిక, శాంతి భద్రతలు, నీటి పారుదల, రెవెన్యూ, మైనింగ్ తదితర శాఖలను సీఎం కేసీఆర్ తన వద్దే ఉంచుకున్నారు.