
Hyderabad, September 09: తెలంగాణ రాష్ట్రంలో సోమవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ (Telangana Budget 2019) సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11:30 నిమిషాలకు సభ ప్రారంభమవుతుంది. 2019-20 సంవత్సరానికి గానూ పూర్తి స్థాయి రాష్ట్ర బడ్జెట్ ను రెండు చట్ట సభల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. గత మార్చినెలలో ఆరు నెలల కాలానికి అసెంబ్లీలో ఆమోదం పొందిన 'ఓట్ ఆన్ అకౌంట్' బడ్జెట్ ఈ సెప్టెంబర్ నెలాఖరుకు కాలపరిమితి ముగుస్తుండటంతో ఈ ఏడాది అక్టోబర్ నుంచి, వచ్చే ఏడాది మార్చి వరకు కాలానికి గానూ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ (K. Chadrashekhar Rao) అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది రెండో సారి.
ఇంతకాలం ఆర్థిక శాఖ తన వద్దే ఉండటంతో బడ్జెట్ కు ఆయనే రూపకల్పన చేశారు. బడ్జెట్ ప్రతులపై కేసీఆర్ పేరే ముంద్రించారు. ఇక తాజాగా ఆర్థిక శాఖ బాధ్యతలు స్వీకరించిన హరీశ్ రావు (T. Harish Rao) మాత్రం శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
ఈ బడ్జెట్ లో పూర్తిగా సీఎం కేసీఆర్ మార్క్ కనబడనుంది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో కొన్ని శాఖలకు బడ్జెట్ లో కోతలు ఉండబోతున్నాయి. అయినప్పటికీ సంక్షేమం, సాగునీరు మరియు వ్యవసాయం రంగాలకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ బడ్జెట్ ను రూపొందించారు. రూ. 1.70 లక్షల కోట్లతో బడ్జెట్ ఉండబోతుందని సమాచారం.