New Delhi, December 03: తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) దిల్లీ పర్యటనలో ఉన్నారు. నిన్న రాత్రే బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి దిల్లీ చేరారు. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తో భేటీ కానున్నట్లు సమాచారం. 26 ఏళ్ల యువ డాక్టర్ దిశ ఘటన (Disha Incident) నేపథ్యంలో చట్టాలను మరింత పటిష్ఠ పరిచి కఠిన శిక్షలు అమలు చేసే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరనున్నారు.
ఇప్పుడున్న చట్టాల ప్రకారం కింది కోర్టులు మరణ శిక్ష విధించినా, పైకోర్టులు ఆ శిక్షలను కుదించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చట్టాలలో మార్పులు తీసుకురావాలని, రేప్ ఘటనల పట్ల మరింత కఠినంగా వ్యవహరించాలని అలాగే విచారణ కూడా వేగంగా జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీని కోరనున్నట్లు తెలుస్తుంది.
ఇక దీనితో పాటు, విభజన హామీల అమలు, ఆస్తుల పంపకాలు, అప్పుల బదలాయింపు, ఆర్టీసీ నష్టాలు తదితర అంశాలను ప్రధాని మోదీతో కేసీఆర్ చర్చించనున్నారు.
రాష్ట్రానికి రావాల్సిన గిరిజన విశ్వవిద్యాలయం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంట్, ఐఐఎం, హైదరాబాద్ లో పలు అభివృద్ధి పనులకు కేంద్ర పరిధిలోని భూకేటాయింపులకు అనుమతులకు సంబంధించి కేంద్రాన్ని కోరనున్నారు.
కాళేశ్వరానికి జాతీయ హోదా, రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులకు నీతి ఆయోగ్ సూచించినట్లుగా నిధుల చెల్లింపు, 13వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన రూ. 2028 కోట్లు ప్రధాని వద్ద ప్రస్తావించనున్నారు. వరంగల్ లో టెక్స్ టైల్ పరిశ్రమ, ఫార్మా సిటీ ఇతర అంశాలను చర్చించనున్నట్లు తెలుస్తుంది.
ప్రధానితో పాటు ఇతర కేంద్ర మంత్రులను సీఎం కేసీఆర్ కలిసే అవకాశం ఉంది. దీంతో పాటు పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ రాజీవ్ శర్మ కుమారుడి పెళ్లి రిసెప్షన్ కు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.