Indra Pratap Singh Shot Dead: కాంగ్రెస్ నేత దారుణ హత్య, గువారా బ్లాక్ కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఇంద్ర‌ ప్ర‌తాప్ సింగ్ ప‌ర్మార్‌పై కాల్పులు జరిపి హతమార్చిన దుండుగులు, ఉన్నత స్థాయి ద‌ర్యాప్తు జ‌రిపించాల‌ని మాజీ సీఎం క‌మ‌ల్‌నాథ్‌ డిమాండ్
Indra Pratap Singh Parmar, Block president of Congress party, Dies (Photo Credits: ANI)

Chhatarpur, Mar 17: మధ్యప్రదేశ్ రాష్ట్రం చత్తార్పూర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చత్తార్పూర్ జిల్లాలోని గువారా బ్లాక్ కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఇంద్ర‌ ప్ర‌తాప్ సింగ్ ప‌ర్మార్‌ను దుండ‌గులు అతి స‌మీపం నుంచి ఛాతీపై కాల్పులు జరిపి (Congress Leader Shot Dead) హతమార్చారు. మంగ‌ళ‌వారం రాత్రి ఇంద్ర‌ ప్ర‌తాప్‌.. మిత్రులతో కలిసి స్థానికంగా ఉండే ఓ హోటల్‌ ముందు నిలబడి ఉండగా, బైక్‌పై వ‌చ్చిన ఇద్దరు దుండ‌గులు ఆయ‌న‌పై కాల్పులు (Indra Pratap Singh Parmar Shot Dead) జ‌రిపి పారిపోయారు.

అక్కడ ఉన్న స్థానికులు హుటాహుటిన అతనిని ఆసుపత్రికి తరలించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అతను అప్పటికే మరణించినట్టు వైద్యులు ధృవీక‌రించారు. కాగా, ఈ ఘటన మొత్తం స్థానికంగా ఉండే సీసీ టీవీలో రికార్డయ్యింది. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఆరుగురిపై కేసులు నమోదు చేసి గాలింపు చేప‌డుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఉరేసుకుని చనిపోయిన బీజేపీ ఎంపీ, ఢిల్లీలో కలకలం రేపుతున్న ఎంపీ రామ్ స్వరూప్ శర్మ అనుమానాస్పద మరణం, కరోనాతో కన్నుమూసిన మరో బీజేపీ కేంద్ర మాజీమంత్రి దిలీప్‌ గాంధీ

కాగా పాతకక్షలే ఇంద్ర ప్రతాప్‌ హత్యకు కారణమని ప్రాథమిక విచారణలో తేలిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. ఇదిలా ఉండగా తమ నేత ఇంద్ర ప్రతాప్‌ హ‌త్య‌తో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయన అనుచరులు ఆసుపత్రిని ధ్వంసం చేసి, ప‌రిస‌ర ప్రాంతాల్లో అల్లర్లు సృష్టించారు. ఇంద్ర ప్రతాప్‌ హ‌త్య‌పై ఉన్న‌త‌ స్థాయి ద‌ర్యాప్తు జ‌రిపించాల‌ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు క‌మ‌ల్‌నాథ్‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు దిగ్విజ‌య్ సింగ్ డిమాండ్ చేశారు.