PM Narendra Modi in Rajya Sabha (Photo Credits: YouTube/NarendraModi)

New Delhi, Feb 9: బుధవారం లోకసభ్‌లో విపక్షాలపై తీవ్రంగా మండిపడిన ప్రధాని మోదీ.. గురువారం కూడా రాజ్యసభలో ప్రతిపక్షాలపై మరోసారి (PM Narendra Modi Speech) విరుచుకుపడ్డారు. నేడు రాజ్యసభలో ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఒక వ్యక్తి చాలా మందిని ఎలా బలంగా ఎదుర్కొంటున్నాడో దేశం గమనిస్తోంది.వారికి (ప్రతిపక్ష పార్టీలు) తగినంత నినాదాలు లేవు, వారి నినాదాలు మార్చుకోవాలి.

ప్రధాని మోదీ అనే వ్యక్తి దేశం కోసమే బతుకుతున్నాడని రాజ్యసభలో ప్రధాని మోదీ (PM Modi Speech in Rajya Sabha) అన్నారు.దేశ ప్రజలను కాంగ్రెస్ వంచిస్తోందని ధ్వజమెత్తారు. గతంలో చేసిన పాపాలకు శిక్ష అనుభవిస్తోందని విమర్శించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి ప్రధాని మోదీ (PM Narendra Modi) సమాధానం ఇస్తుండగా, ప్రతిపక్ష ఎంపీలు రాజ్యసభలో "మోదీ-అదానీ భాయ్-భాయ్" నినాదాలు చేశారు.ఆ నినాదాల మధ్యే ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

నేను దేశం కోసమే బ్రతుకుతున్నాను, రాజ్యసభలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు, ఒక వ్యక్తి చాలా మందిని ఎలా బలంగా ఎదుర్కొంటున్నాడో దేశం గమనిస్తోందని వెల్లడి

మోదీ మాట్లాడుతూ, వారు (ప్రతిపక్షాలు) ఎంత ఎక్కువ బురద జల్లితే, కమలం అంత గొప్పగా వికసిస్తుందని చెప్పారు. కొందరి భాష, ప్రవర్తన భారత దేశానికి నిరాశ కలిగిస్తున్నాయన్నారు. తనపైనా, తన ప్రభుత్వంపైనా ప్రతిపక్షాల ఆరోపణలను ప్రస్తావిస్తూ, వారి వద్ద (ప్రతిపక్షాల వద్ద) బురద ఉందని, తన వద్ద గులాల్ ఉందని, ఎవరి దగ్గర ఏది ఉంటే, దానినే వారు విసురుతారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party)పరిపాలించిన సమయంలో అభివృద్ధికి ఆటంకాలు సృష్టించిందని ఆరోపించారు.

కాంగ్రెస్ పరిపాలించిన ఆరు దశాబ్దాల కాలంలో మన దేశం నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ, అదే సమయంలో చిన్న చిన్న దేశాలు అభివృద్ధి చెందాయన్నారు. ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్న సమయంలో ఆ సమస్యలకు పరిష్కారాలను అందజేయవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉందని, కానీ ఆ పార్టీ నేతల ప్రాధాన్యతలు, ఉద్దేశాలు వేరు అని తెలిపారు. ప్రజలు ఎదుర్కొనే సమస్యలకు శాశ్వత పరిష్కారాల కోసం తాము కృషి చేస్తున్నామన్నారు.

ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోసింది మీరే, ఆర్టికల్ 356 సాయంతో 50 సార్లకు పైగా ప్రభుత్వాలను కూలదోశారు, రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడిన ప్రధాని మోదీ

కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ, ఖర్గే గారు చెప్పినట్లుగా పునాదుల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రయత్నించి ఉండవచ్చునని, అయితే కాంగ్రెస్ పాలనా కాలంలో కేవలం గోతులను మాత్రమే తవ్వారని దుయ్యబట్టారు. గడచిన మూడు, నాలుగేళ్ళలో దాదాపు 11 కోట్ల ఇళ్లకు కొళాయి నీటి కనెక్షన్లు అందినట్లు తెలిపారు.

కొందరు ఎంపీల ప్రవర్తన బాధ కలిగిస్తోందన్నారు. బీజేపీ తన పాలన ద్వారా ప్రజల నమ్మకాన్ని పొందిందని చెప్పుకొచ్చారు. ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలన అంతా శుద్ధ దండగ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనలో జనం డబ్బు మధ్యవర్తలు చేతుల్లోకి వెళ్లిందని ఆరోపించారు.గరీబీ హఠావో అనేది కాంగ్రెస్ నినాదం మాత్రమేనని ఆచరణకు నోచుకోలేదని మోదీ ఫైర్ అయ్యారు. వారు సమస్యలకు పైపూత మాత్రమే పూశార,ని తాము దీర్ఘకాల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించామని పేర్కొన్నారు. విపక్షాలు విసిరే బురదలో కూడా కమలం వికసిస్తుందని వ్యాఖ్యానించారు.

మోదీ-అదానీ భాయ్-భాయ్, రాజ్యసభలో నినాదాలతో హోరెత్తించిన ప్రతిపక్షాలు, నినాదాల మధ్యే ప్రధాని మోదీ ప్రసంగం

తాను రాజకీయ లబ్ధి కోసం ఆలోచించనని, తాము నిజమైన లౌకికవాదాన్ని అనుసరిస్తున్నామని మోదీ అన్నారు. తాము వికాసాన్ని నమ్ముతాం, విపక్షాన్ని కాదని పేర్కొన్నారు. విపక్షాలను చూస్తుంటే జాలేస్తోందన్నారు. ప్రభుత్వాల కూల్చివేతలపై కాంగ్రెస్‌కు మోదీ కౌంటర్ ఇచ్చారు. ఇంధిరా గాంధీ 50 సార్లకుపైగా ఆర్టికల్ 356తో ప్రభుత్వాలను పడగొట్టారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ పాలకులు ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేశారని మండిపడ్డారు.

ఏంజీఆర్, ఎన్టీఆర్ వంటి దిగ్గజాల ప్రభుత్వాలను కాంగ్రెస్ అక్రమంగా పడగొట్టిందని విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ చికిత్స కోసం అమెరికా వెళ్తే ఆయన ప్రభుత్వాన్ని కూడా పడగొట్టారని విమర్శలు గుప్పించారు.మరోవైపు మోదీ ప్రసంగానికి ముందు విపక్షాలు ఆందోళన చేపట్టాయి. అదానీ వ్యవహారంపై మాట్లాడాలని డిమాండ్ చేశాయి. దీంతో విపక్ష సభ్యుల నిరసనల మధ్యే ప్రధాని తన ప్రసంగాన్ని కొనసాగించారు.

రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పిలుపునిచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు గురువారం రాజ్యసభలో ఆయన సమాధానం చెప్తూ, రాజకీయ పార్టీలు దేశ భావి తరాల బాలల భవితతో ఆటలాడుకోకూడదని హెచ్చరించారు.

కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాత పింఛను పథకం (OPS)ను అమలు చేయడానికి ప్రయత్నిస్తుండటాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. మన పొరుగు దేశాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల కార్యకలాపాల్లో కేంద్రం జోక్యం చేసుకుంటోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ పరిపాలనా కాలంలో 50 సార్లు భారత రాజ్యాంగంలోని అధికరణ 356ను ప్రయోగించి, రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చి, రాష్ట్రపతి పాలనను విధించిందన్నారు.

ప్రతిపక్ష పార్టీలు ఉద్యోగం, ఉపాధి మధ్య తేడాను అర్థం చేసుకోవడం లేదన్నారు. డిజిటల్ ఇండియా విస్తరించినందువల్ల డిజిటల్ ఆర్థిక వ్యవస్థ నూతన రంగం వికసిస్తోందని చెప్పారు. మన దేశంలో 90 వేల రిజిస్టర్డ్ స్టార్టప్స్ ఉన్నాయని, ఇవి ఉపాధికి నూతన అవకాశాలను అందుబాటులోకి తీసుకొచ్చాయని తెలిపారు. 2020లో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) పేరోల్‌ (PayRoll)లో 1 కోటి మందికిపైగా నమోదయ్యారన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన వల్ల 60 వేల మందికిపైగా లబ్ధి పొందారన్నారు.

మన దేశం గతంలో మొబైల్ ఫోన్లను దిగుమతి చేసుకునేదని, ఇక ఎంత మాత్రం మొబైల్ ఫోన్ల దిగుమతిదారు కాదని, ఇప్పుడు మనమే వీటిని ఎగుమతి చేస్తున్నామని తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి ప్రకోపానికి గురైన ప్రపంచానికి వ్యాక్సిన్లను ఇచ్చిన భారతీయ శాస్త్రవేత్తలను అగౌరవపరచే, అవమానించే ప్రయత్నాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యం కోసం అయ్యే ఖర్చులకు భయపడే మహిళలకు ఆయుష్మాన్ కార్డు ద్వారా బీమా ప్రయోజనాలను కల్పించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు చిన్న తరహా రైతుల అభివృద్ధికి దోహదపడ్డాయన్నారు. వీటివల్ల భారత దేశ పేదలు సాధికారులయ్యారని తెలిపారు.

అన్ని పథకాల అమలులో నూటికి నూరు శాతం సంతృప్తిని సాధించేందుకు కృషి చేస్తామని తెలిపారు. దీనివల్ల అన్ని రకాల బుజ్జగింపులకు తెరపడుతుందన్నారు. స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన అమృత కాలంలో ఇది నిజమైన లౌకికవాదమని తెలిపారు. నిజమైన లౌకికవాదం అంటే అందరూ సంతృప్తి చెందడమేనన్నారు. కేవలం ఉద్దేశాన్ని వ్యక్తం చేయడం వల్ల ప్రయోజనం ఉండదన్నారు.

వేగం, దిశ, ఫలితాలే అభివృద్ధికి ముఖ్యమైనవని తెలిపారు. ‘అందరితో కలిసి, అందరి అభివృద్ధి’ అంటే ప్రభుత్వం వల్ల కలిగే లబ్ధి సమాజంలోని ప్రతి వర్గానికి తప్పనిసరిగా చేరడమేనని తెలిపారు. తాము నిజమైన లౌకికవాదాన్ని ఆచరిస్తున్నామన్నారు. అన్ని రకాల వివక్షను నిర్మూలించడమే తమ ఆశయమని చెప్పారు. ప్రభుత్వ నినాదం ‘అందరితో కలిసి, అందరి అభివృద్ధి’ అని చెప్పారు. దేశం మద్దతు తమకు ఉందని తెలిపారు. దేశం కాంగ్రెస్‌ను అనేకసార్లు తిరస్కరించిందన్నారు.

గిరిజనులు అభివృద్ధి చెందకుండా కాంగ్రెస్ నిరోధించిందన్నారు. ఆ పాపాలకు శిక్షను ఆ పార్టీ ఇప్పుడు అనుభవిస్తోందన్నారు. వెనుకబడిన వర్గాలన్నిటికీ కొత్త బడ్జెట్‌ గొప్ప అవకాశాలను కల్పించిందని చెప్పారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న 110 జిల్లాలను తాము గుర్తించామని, వీటిని సత్వరం అభివృద్ధి చేయడానికి ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. నిరంతర కృషితో ఈ జిల్లాల్లో విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నాయన్నారు. ఈ జిల్లాల అభివృద్ధిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు.

ఈ అభివృద్ధి వల్ల 3 కోట్ల మందికిపైగా లబ్ధి పొందుతున్నారని చెప్పారు. 2014వ సంవత్సరానికి ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు గిరిజనుల కోసం సుమారు రూ.20,000 కోట్లు కేటాయించిందన్నారు. అయితే తన ప్రభుత్వం రూ.1.20 లక్షల కోట్లు కేటాయించిందని తెలిపారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో ఐదు రెట్లు ఎక్కువ నిధులను గిరిజనాభివృద్ధి కోసం కేటాయించినట్లు చెప్పారు. నాలుగు దశాబ్దాలకు పైగా ఏమీ చేయని కాంగ్రెస్‌ను భారత దేశం తిరస్కరించిందని చెప్పారు. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

2014 వరకు (మోదీ ప్రభుత్వానికి పూర్వం) దేశ జనాభాలో సగం మందికిపైగా బ్యాంకింగ్ సదుపాయాలు ఉండేవి కాదన్నారు. గడచిన తొమ్మిదేళ్ళలో 48 కోట్లకుపైగా బ్యాంకు ఖాతాలను కొత్తగా తెరిచారన్నారు. దేశ సమస్యలకు శాశ్వత పరిష్కారాలను కనుగొనడంపైనే తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. టెక్నాలజీ సహాయంతో పని సంస్కృతిని మార్చామని చెప్పారు. వేగాన్ని మరింత పెంచడం, పరిధిని విస్తరించడంపై దృష్టి సారించామని చెప్పారు. అందరినీ సాధికారులను చేయడానికి బీజేపీ కృషి చేస్తోందన్నారు. అందరికీ మెరుగైన జీవితాన్ని అందించడం కోసం తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు.

కాంగ్రెస్ అనుభవిస్తున్న బాధను తాను అర్థం చేసుకోగలనని మోదీ చెప్పారు. భారత దేశంలో కాంగ్రెస్ ఖాతాను బీజేపీ మూసేసిందన్నారు. కాంగ్రెస్ దేశంలో అభివృద్ధికి ఆటంకాలు సృష్టించిందన్నారు. ఆ పార్టీ పరిపాలన కాలాన్ని దేశం నష్టపోయిందని, అదే సమయంలో చిన్న చిన్న దేశాలు అభివృద్ధి చెందాయని అన్నారు.