Coronavirus scanning at an airport (Photo Credit: PTI)

New Delhi, June 3: దేశంలో మళ్లీ కరోనా కేసులు (Coronavirus in India) పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కఠిన ఆంక్షలు అమలు చేసేందుకు అన్ని రాష్ట్రాలు సమాయాత్తమవుతున్నాయి. తాజాగా విమానాశ్రయాలు, విమానాల్లో ప్రయాణికులు మాస్క్‌లను కచ్చితంగా ధరించేలా నిబంధనలను అమలు చేయాలని (Delhi HC calls for strict action) ఢిల్లీ ధర్మాసనం ఆదేశించింది. అలాగే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పెద్ద మొత్తంలో జరిమానాలు విధించాలని ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) విపిన్ సంఘీ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

కోవిడ్‌ నిబంధనలు పాటించకుంటే విమానం నుంచి దింపేయాలని పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో విమాన ప్రయాణంలో కోవిడ్ నిబంధనలను ( air passengers over Covid rules) ఉల్లంఘించడంపై పిల్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ధర్మాసనం కోవిడ్‌ నిబంధనలు అమలు చేయడమే కాకుండా ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోమని పేర్కొంది. కరోనా కట్టడి చేసే దిశగా ప్రజల ఆరోగ్య దృష్ట్యా మాస్క్‌ ధరించడం, హ్యండ్‌ శానిటైజేషన్‌ వంటి నిబంధనలను అమలు చేస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు ఉల్లంఘించే ప్రయాణికుల పై కఠిన చర్యలు తీసుకునేలా విమానాశ్రయాలు, విమానాల సిబ్బందికి పూర్తి అధికారాలు ఇస్తూ కరోనాకి సంబంధించిన ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేయమని డీజీసీఏని ఆదేశించింది.

మళ్లీకరోనా పంజా, 3 నెలల తరువాత 4 వేలకు పైగా కేసులు నమోదు, గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 4,041 పాజిటివ్ కేసులు, 10 మంది మృతి

పైగా నిబంధనలను ఉల్లంఘించిన వ్యక్తులపై జరిమానా విధించడం తోపాటు సదరు వ్యక్తుల పేర్లను కూడా నో ఫ్లై లిస్ట్‌లో ఉంచాలని ఆదేశించింది. ఐతే ధర్మాసనం తినేటప్పుడు లేదా తాగేటప్పుడు మాస్క్‌ని తొలగించేలా చిన్న వెసుల బాటు కల్పించింది. మాస్క్ ధారణ, చేతుల పరిశుభ్రత నిబంధనలను ఉల్లంఘించే ప్రయాణికులపై చర్యలు తీసుకునేందుకు ఎయిర్ హోస్టెస్‌లు, కెప్టెన్లు, పైలట్లు సహా ఇతర అధికారులకు అధికారాన్ని కల్పించాలని తెలిపింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ సచిన్ దత్తా ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది.

డీజీసీఏ తరపున న్యాయవాది అంజన గోసాయిన్ వాదనలు వినిపిస్తూ, కోవిడ్-19 ప్రోటోకాల్‌ను కచ్చితంగా అమలు చేయాలని మే 10న పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చిందన్నారు. మాస్క్ ధారణకు సంబంధించిన అన్ని నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తున్నారని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, డీజీసీఏ ఈ ఆదేశాలను ఇవ్వడం సరైన చర్యేనని తెలిపింది. ఈ మహమ్మారి తీవ్రత ఇంకా తగ్గలేదని, తన వికృత రూపాన్ని ఇంకా ప్రదర్శిస్తూనే ఉందని పేర్కొంది. నిబంధనలు, మార్గదర్శకాలు ఉంటున్నాయని, కానీ వాటి అమలు వరకు వచ్చేసరికి మనం తడబడుతున్నామని పేర్కొంది.

వీటిని సక్రమంగా అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, చేపట్టిన చర్యలకు సంబంధించిన నివేదికను సమర్పించాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణ జూలై 18న జరుగుతుందని తెలిపింది.