New Delhi, November 8: భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 45,674 కోవిడ్ పాజిటివ్ కేసులు (COVID-19 Cases in India) నమోదయ్యాయి. తాజా కేసులతో భారత్‌లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 85,07,754 కి చేరాయి. కోవిడ్ వైరస్ బాధితుల్లో మరో 559 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,26,121 కు (Covid Deaths) చేరింది. శనివారం ఒక్కరోజే 49,082 మంది కోవిడ్ నుంచి కోలుకోవడంతో.. కోలుకున్నవారి మొత్తం సంఖ్య 78,68,968 కు (Coronavirus Outbreak in India) చేరింది.
దేశంలో మొత్తం 5,12,665 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీటిలో 2.57 లక్షల కేసులు మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌లో ఉన్నాయి. కాగా మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య లక్షకు దిగువకు చేరింది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Ministry of Health and Family Welfare) ఆదివారం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
కోవిడ్ రోగుల రికవరీ రేటు 92.49 శాతానికి పెరిగిందిని తెలిపింది. భారత్‌లో కోవిడ్ మరణాల రేటు 1.48 శాతంగా ఉందని.. దానిని ఒక శాతానికి తగ్గించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించింది. అదే సమయంలో రాష్ట్రాలవారీగా కరోనా వైరస్ పాజిటివిటీ రేటును 5 శాతానికి పరిమితం అయ్యేలా పనిచేస్తున్నామని బులెటిన్‌లో పేర్కొంది. దేశంలోని మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్యలో 6.03 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది. శీతాకాలం కావడంతో కరోనా అధికంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
దగ్గు తుంపర్లతో చాలా ప్రమాదం, సింగపూర్ ఇన్‌స్టిట్యూట్ అధ్యయనంలో వెల్లడి
మహారాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 45 వేలు దాటింది. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 3,959 పాజిటివ్ కేసులు, 150 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,14,273కు, మరణాల సంఖ్య 45,115కు పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో 6,748 మంది కరోనా రోగులు కోలుకుని దవాఖానల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 15,69,090కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం 99,151 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, దేశంలో కరోనా కేసులు, మరణాలపరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది.