Coronavirus in India (Photo Credits: PTI)

Hyd, Nov 8: తెలంగాణలో గత 24 గంటల్లో 42,673 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,440 పాజిటివ్‌ కేసులు (Telangana Coronavirus) నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 2,50,331కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఐదుగురు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 1377కి (Covid Deaths) చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్క రోజే వ్యాధి బారీ నుంచి 1,481 మంది కోలుకున్నారు.

దీంతో ఇప్పటివరకు కరోనావైరస్ (COVID-19) నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,29,064కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 19,890 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వారిలో 17,135 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 46,18,470కి చేరింది.

ఇదిలా ఉంటే సింగపూర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హై పెర్‌ఫార్మెన్స్‌ కంప్యూటింగ్‌ తుంపర్ల విషయంలో కొత్త అధ్యయనాన్ని వెల్లడించింది. ఈ అధ్యయనం ప్రకారం దగ్గు తుంపర (సింగిల్‌ కాఫ్‌ డ్రాప్‌లెట్‌) సెకనుకు 2 మీటర్ల వాయువేగం ఉన్న పరిస్థితుల్లో 6.6 మీటర్ల దూరం ప్రయాణిస్తుందని, పొడి వాతావరణంలో మరింత దూరం వెళ్లే అవకాశాలున్నాయని తేల్చింది. కరోనా కణాల వైరల్‌ ట్రాన్సిమిషన్‌ను మరింతగా అర్థం చేసుకునేందుకు ‘ఫ్లూయిడ్‌ సైన్సెస్‌’అంశాలను అధ్యయనంలో భాగంగా చేర్చారు. కాగా కరోనా సోకిన వ్యక్తి మాట్లాడినప్పుడు, తగ్గినపుడు, తుమ్మినపుడు సూక్ష్మరూపంలో వైరస్‌ కణాలు వెలువడి.. మీటరు దూరంలో ఉండే వ్యక్తులు వాటి బారినపడే అవకాశాలు ఎక్కువున్నట్టు గతంలోనే అంచనా వేశారు. వివిధ సంస్థలు నిర్వహించిన పరిశీలనల్లో భాగంగా దగ్గు తుంపర్లు (డ్రాప్‌లెట్లు) ఏ దిశలో ఎలా పయనిస్తాయనేది అధ్యయనం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో అమెజాన్ సంస్థ రూ. 20 వేల కోట్ల పెట్టుబడులు, సంస్థ ఏసియన్ ఫసిఫిక్ రీజియన్‌గా హైదరాబాద్ నగరం, స్వాగతించిన ఐటీ మంత్రి కేటీఆర్

సాధారణంగా ఒక వ్యక్తి దగ్గినపుడు వివిధ పరిమాణాల్లో వెయ్యిదాకా తుంపర్లు వెలువడతాయి. వాటిలో బరువు ఎక్కువగా ఉన్నవి త్వరగా నేలపై పడిపోగా.. గాలి వేగం లేకున్నా ఒక మీటర్‌ వరకైతే అవి ప్రయాణిస్తాయని పరిశోధకులు వెల్లడించారు. మధ్యస్త సైజు దగ్గు తుంపర్లు చిన్నచిన్నవిగా విడిపోయి గాలితో పాటు మరింత దూరం ప్రయాణిస్తాయి. అవి ఆవిరైపోయే క్రమంలో ఏరోసోల్స్‌గా మారి ఊపిరి పీల్చినపుడు సులభంగా శ్వాసతీసుకునే మార్గంలో ఊపిరితిత్తులోకి ప్రవేశిస్తాయి.

ఆవిరి కాని తుంపర్ల కంటే ఆవిరై ఏరోసోల్స్‌గా మారే కణాలు లేదా డ్రాప్‌లెట్లతోనే మరింత ప్రమాదమని తాజా పరిశోధనలో పేర్కొన్నారు. వాయు ప్రసారం, వేగంతో పాటు వాతావరణంలోని వివిధ అంశాల ప్రభావం, వివిధ స్థాయిల్లోని గాలి వేగం వల్ల మనుషుల శరీరాల చుట్టూ గాల్లోని దగ్గు తుంపర్లు ఏ మేరకు ప్రయాణిస్తాయనేది ‘మ్యాథమేటికల్‌ ఫార్ములేషన్స్‌’తో పరిశీలించారు. దగ్గర్లోని వ్యక్తులకు దగ్గు తుంపర్లు ఎలా చేరుకుంటాయనేది సైతం అధ్యయనం చేశారు.

పరిశోధనలో భాగంగా సమశీతోష్ణస్థితి ఉన్న వాతావరణంలో, బహిరంగ ప్రదేశాల్లో గాలిలో ప్రయాణించే దగ్గు తుంపర్లు లేదా కణాలపై దృష్టిపెట్టారు. ఇందులో సాధించిన ఫలితాలు, అంచనాలను ఇండోర్‌ ప్రదేశాలతో పాటు బహిరంగ ప్రదేశాలు, ఎక్కువ మంది గుమికూడే కాన్ఫరెన్స్‌ హాల్స్, థియేటర్ల వంటి చోట్ల కూడా తమ పరిశోధనలతో మరింత లోతుగా పోల్చిచూసేందుకు సింగపూర్‌ ఇన్‌స్టిట్యూట్‌ సిద్ధమవుతోంది.