Vaccine | Representational Image | (Photo Credits: Flickr)

New Delhi, June 2: విదేశీ టీకాలకు అనుమతి ప్రక్రియల్లో డ్ర‌గ్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (DCGI) మార్పులు చేసింది. ఇప్పటివరకూ ఉన్న ఆంక్షలను సవరించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO )​ఆమోదించిన అన్ని టీకాలకు దేశంలో వర్తించేలా చేసింది. దీనికి ప్రకారం ఇప్ప‌టికే వివిధ దేశాలు, డ‌బ్ల్యూహెచ్‌వో అత్య‌వ‌స‌ర వినియోగానికి ఆమోదం పొందిన వ్యాక్సిన్ల‌కు (COVID-19 Vaccine) ఇండియాలో మ‌ళ్లీ ట్ర‌య‌ల్స్ అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఈ నిర్ణ‌యంతో ఫైజ‌ర్‌, మోడెర్నాలాంటి విదేశీ కంపెనీల వ్యాక్సిన్ల‌కు ఇండియాలో మార్గం సుగమం చేసింది.

దేశంలో వ్యాక్సిన్ల‌ భారీ డిమాండ్‌, కరోనా ఉధృతి నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు డీసీజీఐ చీఫ్ వీజీ సోమానీ వెల్ల‌డించారు. కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ల కోసం ఏర్పాటు చేసిన నిపుణుల బృందం డీసీజీఐకి ఈ సిఫార‌సు చేసింది. ఇప్ప‌టికే ప్ర‌పంచవ్యాప్తంగా కోట్ల మంది తీసుకున్న వ్యాక్సిన్లు, యూఎస్ ఎఫ్‌డీఏ, ఈఎంఏ, యూకే ఎంహెచ్ఆర్ఏ, పీఎండీఏ, జ‌పాన్ లేదా ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఎమ‌ర్జెన్సీ యూజ్ లిస్ట్‌లో ఉన్న వ్యాక్సిన్ల‌కు ఇండియాలో క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ అవ‌స‌రం లేద‌ని నిర్ణ‌యించిన‌ట్లు సోమానీ ఒక లేఖ‌లో తెలిపారు.

అదుపులో కరోనా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్‌పై మొదలైన కలవరం, గత 24 గంటల్లో 1,32,788 కేసులు నమోదు, కొత్తగా 3,207 మరణాలతో 2,83,07,832కు పెరిగిన మరణాల సంఖ్య, మూడో దశ కొవిడ్‌పై రాష్ట్ర ప్రభుత్వాలు హైఅలర్ట్‌

గ‌తంలో విదేశాల్లో ట్ర‌య‌ల్స్ పూర్తి చేసి అనుమ‌తి పొందిన వ్యాక్సిన్లు కూడా ఇండియాలో బ్రిడ్జింగ్ ట్ర‌య‌ల్స్ లేదా ప‌రిమిత స్థాయిలో క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించాల‌న్న నిబంధ‌న ఉండేది. ఇప్పుడా నిబంధ‌న‌ను ఎత్తివేశారు. భారతదేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేసే దిశలో ఫైజర్, మోడెర్నా టీకాల ఆమోదాన్ని వేగవంతం చేయనున్నామనీ, ప్రభుత్వం వారు కోరిన ప్రధాన రాయితీని కూడా ఇచ్చేందుకు సిద్ధమని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.

ఈ కంపెనీలు భారతదేశంలో అత్యవసర వినియోగ అధికారం కోసం దరఖాస్తు చేసుకుంటే తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా భారీ డిమాండ్ ఉన్నందున ఫైజర్, మోడెర్నా భారత్‌కు చేరడానికి కొంత సమయం పడుతుందని అంచనా. జూలై , అక్టోబర్ మధ్య భారతదేశానికి 5 కోట్ల మోతాదులను అందించడానికి ఫైజర్, సిద్ధంగా ఉంది.