New Delhi, June 2: దేశంలో కరోనా సెకండ్ వేవ్ క్రమంగా అదుపులోకి వస్తోంది. రాష్ట్రాలు విధించిన లాక్‌డౌన్లు, కర్ఫ్యూల ఆంక్షల ఫలితాలు కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యంత తక్కువ స్థాయిలో 1,32,788 కేసులు (COVID-19 in India) వెలుగులోకి వచ్చాయి. క్రితం రోజు(1,27,510)తో పోల్చితే కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది.
అలాగే క్రితం రోజు 2,795 మరణాలు (COVID 19, COVID 19 Deaths in India) సంభవిస్తే.. తాజాగా ఆ సంఖ్య 3,207కి చేరింది. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 2,83,07,832కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో పోరాడుతూ 3,207 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 3,35,102కు చేరింది.గత కొన్ని రోజులుగా కొత్తగా నమోదవుతున్న కేసుల కంటే రికవరీలే అధిక సంఖ్యలో ఉండటం ఊరట కలిగిస్తోంది.
తాజాగా 2,31,456 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకూ కరోనాను జయించిన వారి సంఖ్య 2,61,79,085కి పెరిగింది. దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 92.48 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 17,93,645 క్రియాశీల కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 20,19,773 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 35 కోట్లకు చేరింది. దేశంలో ఇప్పటి వరకూ 21,85,46,667 టీకాలు ఇచ్చారు.
కరోనా మూడోవేవ్ సంకేతాలతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు ముందుజాగ్రత్త చర్యలను చేపట్టడంపై ప్రత్యేక దృష్టిసారించాయి. వైరస్ వల్ల పిల్లలే ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశాలు ఉన్నందున.. వారి చికిత్సకు అవసరమైన ఔషధాలను నిల్వ చేసుకునే దిశగా చర్యలను చేపట్టాయి. కొత్త ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహించడంతో పాటు మరిన్ని కరోనా టెస్టింగ్ ల్యాబ్‌లను నెలకొల్పే యత్నాల్లో నిమగ్నమయ్యాయి.
ఈక్రమంలోనే పన్నెండేళ్లలోపు పిల్లలు ఉండే తల్లిదండ్రులకు వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యమిస్తామని యూపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. రెండేళ్లలోపు పిల్లలున్న వారు, బాలింతలకు వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యమివ్వాలని గోవా సర్కారు యోచిస్తోంది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఛత్తీ్‌సగఢ్, హరియాణా, మధ్యప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలు పిల్లల కరోనా చికిత్సకు ప్రత్యేక వార్డుల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేశాయి.
తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు మరో ముందడుగు వేసి.. పిల్లల కొవిడ్ చికిత్సకు సంబంధించిన ప్రత్యేక ప్రొటొకాల్ రూపకల్పనపై కసరత్తును ప్రారంభించాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరాఖండ్, జార్ఖండ్, గోవా, హిమాచల్‌ప్రదేశ్‌లు పీడియాట్రిక్ టాస్క్‌ఫోర్స్‌లను ఇప్పటికే ప్రకటించాయి.