Assembly Polls 2022: మళ్లీ మోగనున్న ఎన్నికల నగారా..వచ్చే ఏడాది 5 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, పంజాబ్‌, మ‌ణిపూర్‌, ఉత్త‌రాఖండ్‌, గోవా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపిన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ సుశీల్ చంద్ర
Chief Election Commissioner Sushil Chandra (Photo-Twitter)

New Delhi, June 1: వ‌చ్చే ఏడాది ప్రారంభంలోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వ‌హిస్తామని కేంద్ర ఎన్నిక‌ల సంఘం (Election Commission) తెలిపింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, పంజాబ్‌, మ‌ణిపూర్‌, ఉత్త‌రాఖండ్‌ల‌తోపాటు గోవా అసెంబ్లీల‌కు వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు జ‌రగాల్సి ఉంది. స‌కాలంలోనే ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తామ‌ని కేంద్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ సుశీల్ చంద్ర (Chief Election Commissioner Sushil Chandra) పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో చెప్పారు. కాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ గ‌డువు 2022 మే నెలాఖ‌రుతో ముగుస్తుంది.

మిగ‌తా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ గ‌డువు మార్చి నెల‌తో తీరిపోతుంది.ఈ నేపథ్యంలో షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు (5 States assembly polls) నిర్వహించడం ఎన్నికల సంఘానికి రాజ్యాంగం ఇచ్చిన బాధ్యత అని చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ సుశీల్‌ చంద్ర తెలిపారు. పంజాబ్ మిన‌హా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. బీహార్‌, ప‌శ్చిమ బెంగాల్‌ల‌తో పాటు ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో చాలా అనుభ‌వం గ‌డించామ‌ని సుశీల్ చంద్ర పీటీఐకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.

గ‌డువు తీరిపోయే లోపు ఆయా రాష్ట్రాల అసెంబ్లీల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించి, గెలుపొందిన శాస‌న‌స‌భ్యులు జాబితాను సంబంధిత రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌కు స‌మ‌ర్పించ‌డం త‌మ విధి అని చెప్పారు. ఇదిలా ఉంటే శాస‌న‌మండ‌లి/ రాజ్య‌స‌భ ద్వైవార్షిక ఎన్నిక‌ల‌తోపాటు కొన్ని లోక్‌స‌భ‌, అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నిక‌ల‌ను క‌రోనా నేప‌థ్యంలో వాయిదా వేసిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ,ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా వాయిదా వేశారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా, ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం, ఏపీలో మే 31తో ముగ్గురి ఎమ్మెల్సీల పదవీ కాలం పూర్తి, తెలంగాణలో ఆరుగురి ఎమ్మెల్సీల పదవీకాలం జూన్ 3తో పూర్తి

క‌రోనా సెకండ్ వేవ్ తీవ్ర‌త గురించి తాము అవ‌గాహ‌న‌తోనే ఉన్నాం అని సుశీల్ చంద్ర వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం కేసుల సంఖ్య త‌గ్గుతున్న‌ద‌ని చెప్పారు. బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌లు క‌రోనా మ‌ధ్యే నిర్వ‌హించాం అని ఈ సంధర్భంగా గుర్తు చేశారు. ఇటీవ‌లే మ‌రో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నిక‌లు కూడా నిర్వ‌హించామ‌ని చెప్పారు. ఈ ఎన్నిక‌ల్లో చాలా అనుభ‌వం గ‌డించామ‌ని తెలిపారు.

గ‌తేడాది బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌లను కోవిడ్‌-ప్రీ ఎల‌క్ష‌న్‌గా నిర్వ‌హించ‌డానికి ఈసీ ప‌లు నిర్ణ‌యాలు తీసుకున్న‌ది. 80 ఏండ్లు దాటిన వారికి, కోవిడ్‌తో బాధ‌ప‌డుతున్న వారికి పోస్ట‌ల్ బ్యాలెట్ ఉప‌యోగించుకునే వెసులుబాటు క‌ల్పించింది. ప్ర‌తి పోలింగ్ కేంద్రంలోనూ ఓటు వేసే ఓట‌ర్ల సంఖ్య‌ను 1500 నుంచి 1000 మందికి త‌గ్గించివేసింది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ప‌రిధిలో సుమారు 80 వేల పోలింగ్ కేంద్రాలు పెరిగాయి. ఇదే ప‌ద్ధ‌తి వ‌చ్చే ఏడాది జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కొన‌సాగుతుంద‌ని సుశీల్ చంద్ర చెప్పారు.

కరోనా వ్యాప్తికి ఈసీదే బాధ్యత, సంచలన వ్యాఖ్యలు చేసిన మద్రాస్ హైకోర్టు

కరోనావైరస్ కల్లోలం రేపుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు వివిధ దశల్లో పోలింగ్‌ నిర్వహించడంతో కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర విమర్శలు ఎదుర్కోంది. ముఖ్యంగా వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్నా.. పశ్చిమబెంగాల్‌లో ఎనిమిది దశల్లో పోలింగ్‌ నిర్వహించారు. ఇలా ఆయా రాష్ట్రాల్లో సెకండ్‌ వేవ్‌కు కారణం ఎన్నికల ప్రచారాలేనని విమర్శలూ వచ్చాయి. భారీ స్థాయిలో బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించడం కరోనా ఉద్ధృతికి ఒక కారణమని పలు నివేదికలు వెల్లడించాయి.

కొత్త ఎస్ఈసీగా సుశీల్‌ చంద్ర బాధ్యతలు స్వీకరణ, 24వ సీఈసీగా విధు‌లు నిర్వహించనున్న సుశీల్‌ చంద్ర , 2022 మే 14 వరకు సీఈసీగా పదవిలో..‌, పదవీ విరమణ చేసిన సునీల్‌ అరోరా

ఇక ఈ విషయంపై రాజకీయ పార్టీలు, అభ్యర్థులను ముందస్తుగానే హెచ్చరించినప్పటికీ వారు కొవిడ్‌ నిబంధనలు పాటించడం లేదని కేంద్ర ఎన్నికల సంఘం సైతం ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి సమయంలో వచ్చే ఏడాది జరుగబోయే ఎన్నికలపై ఆందోళనతో పాటు ఆసక్తి నెలకొంది. అప్పటివరకు ఎక్కువ జనాభాకు వ్యాక్సిన్‌ అందించగలిగితే సమస్యలు ఉండకపోవచ్చనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఎన్నికల సందర్భంగా కోడ్‌ను కఠినంగా అమలు చేస్తామని , ఎన్నికల నియామవళి ఉల్లంఘించిన వాళ్లపై కఠిన చర్యలు ఉంటాయని కూడా ఈసీ వివరణ ఇచ్చింది.