Union Health Minister Dr Harsh Vardhan (Photo Credits: PIB)

New Delhi, January 2: దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ టీకాను ఉచితంగా పంపిణీ చేయ‌నున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ తెలిపారు. ఢిల్లీలోని దరియాగంజ్‌లో మెటర్నిటీ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెంటర్‌లో వ్యాక్సినేషన్ డ్రై రన్ తీరును సమీక్షించిన అనంతరం ఆయన (Harsh Vardhan) మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అందరికీ కోవిడ్-19 వ్యాక్సిన్‌ను (COVID19 Vaccine) ఉచితంగా ఇస్తామన్నారు. అయితే తొలి విడత‌లో కేవ‌లం మూడు కోట్ల మందికి మాత్ర‌మే ఉచిత టీకా (Free COVID-19 Vaccine) ఇవ్వ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

మొద‌టి విడత‌కు సంబంధించి మ‌రో 27 మంది కోట్ల గురించి వివ‌రాల‌ను సేక‌రిస్తున్న‌ట్లు ఆయ‌న అన్నారు. ఉచిత వ్యాక్సిన్ తీసుకోనున్న మొద‌టి మూడు కోట్ల మందిలో కోటి మంది హెల్త్‌కేర్ వ‌ర్క‌ర్లు, రెండు కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్లు ఉంటార‌ని ఆయ‌న అన్నారు. ఇవాళ ఢిల్లీలో టీకా డ్రై ర‌న్ సంద‌ర్భంగా ఆయ‌న ఓ హాస్పిట‌ల్‌ను సంద‌ర్శించారు.

ఢిల్లీలో మాదిరిగా దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ఉచితంగా పంపిణీ చేస్తారా? అని విలేకర్లు అడిగినపుడు డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ, ఢిల్లీలోనే కాదు, ఇది దేశవ్యాప్తంగా ఉచితమేనని చెప్పారు. అంతకుముందు ఆయన గురు తేజ్ బహదూర్ హాస్పిటల్‌లో డ్రై రన్‌ను సమీక్షించారు.

కోటి మూడు లక్షలు దాటిన కోవిడ్ కేసులు, దేశంలో తాజాగా 19,078 మందికి కరోనా, 24 గంట‌ల్లో 224 మంది మృతి, మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 2,50,183

ఢిల్లీలో మొత్తం మూడు చోట్ల డ్రై రన్ నిర్వహిస్తున్నారు. గురు తేజ్ బహదూర్ హాస్పిటల్‌, మెటర్నిటీ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెంటర్‌, వేంకటేశ్వర హాస్పిటల్‌‌లలో డ్రై రన్ నిర్వహిస్తున్నారు. డ్రై రన్‌లో వ్యాక్సిన్‌ను ఇవ్వడం మినహా మిగతా కార్యకలాపాలను నిర్వహిస్తారు. వ్యాక్సిన్ తీసుకునేవారి పేరు నమోదు చేయడం, వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తికి విశ్రాంతి కల్పించడం, ఆ వ్యక్తికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఏం చేయాలి? వంటివాటిని ప్రయోగాత్మకంగా నిర్వహిస్తారు.

ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధిపరచిన వ్యాక్సిన్‌ను నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. ఈ సిఫారసులను డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం కోసం పంపించారు. త్వరలోనే ఈ సిఫారసులపై డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా సిఫారసులు వస్తాయని హర్షవర్ధన్ చెప్పారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వ్యాక్సినేషన్ జనవరి 6 నుంచి ప్రారంభమవుతుందని తెలుస్తోంది.