Coronavirus in India: కరోనా వైరస్ భయాలు ఇక లేనట్టే, మూడోదశ ముగిసిందని తెలిపిన ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ డి.జాకోబ్ జాన్, దేశంలో కొత్తగా 4575 కరోనా కేసులు, గత 24 గంటల్లో 145 మంది మృతి
Coronavirus in India | (Photo Credits: PTI)

New Delhi, Mar 9: దేశంలో మంగళవారం మూడు వేలకుపైగా కేసులు నమోదవగా, తాజాగా 4 వేల 5 వందల మందికి పాజిటివ్‌ వచ్చింది. దేశవ్యాప్తంగా కొత్తగా 4575 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,29,75,883కు చేరాయి. ఇందులో 4,24,13,566 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,15,355 మంది బాధితులు మరణించగా, 46,962 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

కాగా, గత 24 గంటల్లో 145 మంది మృతిచెందారని, 7416 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.11 శాతం మాత్రమే ఉన్నాయని, 98.69 శాతం మంది కోలుకున్నారని తెలిపింది. 1.20 శాతం మంది మృతిచెందారని వెల్లడించింది. ఇక 1,79,33,99,555 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది. మంగళవారం ఒక్కరోజే 18,69,103 మంది వ్యాక్సినేషన్‌ చేశామని వెల్లడించింది.

కరోనా వైరస్ భయాలు ఇక లేనట్టేనని ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ డి.జాకోబ్ జాన్ పేర్కొన్నారు. దేశంలో కరోనా మూడోదశ ముగిసిందని, ఇక నాలుగో దశ భయాలు అక్కర్లేదని అన్నారు. పూర్తిగా భిన్నమైన వేరియంట్ వస్తే తప్ప నాలుగో వేవ్ ఆందోళన అక్కర్లేదని అన్నారు. దేశం మరోమారు ఎండమిక్ దశకు చేరుకుందన్నారు. గతంలో వచ్చిన శ్వాసకోశ సంబంధిత వ్యాధులన్నీ ఇన్‌ఫ్లూయెంజా కారణంగానే వచ్చాయని, ప్రతి ఇన్‌ఫ్లూయెంజా రెండు, మూడు దశల తర్వాత ముగిసిందని డాక్టర్ జాన్ గుర్తు చేశారు. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)కి చెందిన వైరాలజీ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సెంటర్‌కు డాక్టర్ జాన్ గతంలో డైరెక్టర్‌గా పనిచేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయనీ విషయాన్ని వెల్లడించారు.