Kerala, SEP 04: రామన్ మెగసెసేను ఆసియా నోబెల్‌గా (Asian version of the Nobel Prize) పిలుస్తారు. 1957లో స్థాపించిన రామన్ మెగసెసే అవార్డు (Magsaysay award) ఆసియా అత్యున్నత పురస్కారం. వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసే పేరిట ఈ అవార్డు అందిస్తుంటారు. ఈ అవార్డును అమెరికాకు చెందిన రాక్ ఫెల్లర్ బ్రదర్స్, ఫిలిప్పీన్స్ (Philippines) ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. ఇంత గొప్ప పురస్కారం వస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ, కేరళ ఆరోగ్యశాఖ మాజీ మంత్రి, సీపీఎం సీనియర్ నేత కేకే శైలజ (KK Shailaja) మాత్రం సున్నితంగా తిరస్కరించారు. దీని వెనుక బలమైన కారణమే ఉంది. రామన్ మెగసెసే ఫిలిప్పీన్స్ మూడో అధ్యక్షుడు (Philippine President). ఆ దేశంలో కమ్యూనిస్టులను ఉక్కుపాదంతో అణచివేశాడన్న చరిత్ర ఉంది. అందుకే ఆయన పేరుతో ఉన్న అవార్డును స్వీకరించడంలేదని కేకే శైలజ వెల్లడించారు. రాష్ట్రంలో నిఫా వైరస్, కోవిడ్ సోకిన సందర్భంగా వాటిని అదుపు చేయడంలో ఆమె సమర్ధవంతంగా పనిచేశారు. కేకే.శైలజ చేసిన సేవలకుగాను, ఆమె పేరును తమ కమిటీ రామన్ మెగసెసే అవార్డు కోసం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపింది. దీనిపై ఆమె అనుమతి కావాలని కోరారు. వారు అనుమతిస్తేనే అవార్డు కోసం పరిశీలించి, ప్రకటిస్తారు.
అయితే, తానొక రాజకీయ పార్టీకి చెందిన నేత కాబట్టి, ఈ విషయంపై పార్టీతో సంప్రదించి నిర్ణయం చెబుతానని అవార్డు కమిటీకి ఆమె వివరించారు. అనంతరం తను అవార్డును నిర్ణయిస్తున్నట్లు కమిటీకి తెలిపారు. దీనికి కారణం.. శైలజ ఈ అవార్డు తీసుకునేందుకు పార్టీ హై కమాండ్ అంగీకరించకపోవడమే. ఈ అంశంపై స్వయంగా కేకే శైలజ (KK Shailaja) ఈ వివరాల్ని వెల్లడించారు. తనకు కమిటీ నుంచి సమాచారం అందిందని, అయితే పార్టీని సంప్రదించిన తర్వాత అవార్డు తీసుకోకూదని నిర్ణయించుకున్నట్లు ఆమె చెప్పారు.
‘‘సాధారణంగా ఈ అవార్డుకు రాజకీయ నాయకులను పరిగణనలోకి తీసుకోరు. అయినా, నాకీ అవార్డు ఇవ్వాలనుకున్నారు. అయితే, నేను సీపీఎంలో కేంద్ర సభ్యురాలిని. ఈ అవార్డు అందజేసే సంస్థ కమ్యూనిజాన్ని నమ్మదు. అందువల్ల ఆ సంస్థ అందజేసే అవార్డును తీసుకోకూడదు అని నిర్ణయించుకున్నా’’ అని కేకే శైలజ చెప్పారు. రామన్ మెగసెసే అవార్డు అంతర్జాతీయంగా చాలా ప్రతిష్టాత్మకమైనది. దీన్ని ‘ఆసియా నోబెల్’గా కూడా పిలుస్తారు.