Mumbai, Mar 17: ఈ ఏడాది భారత్‌ను తాకడానికి తొలి తుఫాన్ ఆసని దూసుకొస్తోంది. నైరుతి హిందూ మహాసముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని.. వచ్చే వారం ప్రారంభంలో అది తుఫానుగా మారుతుందని భారత మెట్రోలాజికల్ డిపార్ట్‌మెంట్ (IMD) ఇది వరకే హెచ్చరించింది. మధ్య బంగాళాఖాతంలో ఈ తుఫాన్ (Cyclone Asani) మార్చి 21న ఏర్పడనుంది. దీని ప్రభావం అండమాన్ నికోబార్ దీవులపై (Andaman and nicobar islands) అధికంగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
అయితే ఈ తుఫాన్ ( Season’s First Cyclonic Storm) భారత తీరం తాకే అవకాశం లేదని అధికారులు తెలిపారు. హిందూ మహాసముద్రం, నైరుతి బంగాళాఖాతంలో మంగళవారం సాయంత్రం ఏర్పడిన అల్పపీడనం, బుధవారం మధ్య దక్షిణ బంగాళాఖాతం మీదుగా ప్రయణిస్తోంది. అనంతరం మార్చి 19 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ మీదుగా కదులుతూ, అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అనంతరం నికోబార్ దీవులు మీదుగా ప్రయణించి మార్చి 20 నాటికి అల్పపీడనంగా మారి, మార్చి 21వ తేదీన అసని తుఫానుగా మారుతుందని అధికారులు వెల్లడించారు.
దీని ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవుల్లో బలమైన ఈదురుగాలులు, మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. తుఫాను బంగ్లాదేశ్, ఉత్తర మయన్మార్ వైపు కదులుతుందని గత వారం IMD అంచనా వేసింది. తుఫాన్ యెుక్క ప్రభావం తూర్పు, ఈశాన్య భారతంపై ఉండే అవకాశం కనిపిస్తోంది. మార్చి 18 వరకు బంగాళఖాతం, హిందూ మహా సముద్ర మీదుగా గంటలకు 40 నుంచి 50 కి.మీల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
మార్చి 19న, దక్షిణ అండమాన్ సముద్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు/ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. మార్చి 21 నాటికి ఈ వేగం క్రమంగా పెరుగుతూ.. ఏకంగా గంటకు ఏకంగా 70 నుంచి 80 కిలోమీటర్లకు చేరుకుంటుంది. ఇక మార్చి 23న బంగాళ ఖాతం, బంగ్లాదేశ్, మయన్మార్ తీరాల్లో గంటకు 70 నుంచి 80 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.