Cyclone Kyarr: బలహీనపడుతున్న క్యార్ తుఫాను, మరో 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక, హైదరాబాద్ నగరాన్ని మంచెత్తిన భారీ వర్షం
Representational Image (Photo Credits: PTI)

Mumbai:  క్యార్ తుఫాన్ ప్రభావంతో దక్షిణ భారతదేశంలోని కేరళ, దక్షిణ కర్ణాటక, తమిళనాడు లోని కొన్ని ప్రాంతాలు, రాయలసీమ, తెలంగాణలోని కొన్ని చోట్ల మరియు లక్షద్వీప్ ప్రాంతాలలో మంగళవారం భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ (IMD- India Meteorological Department)  అంచనా వేసింది. అక్టోబర్ 29న ఉదయం 5.30 గంటలకు ముంబైకి పశ్చిమాన 980 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో కేంద్రీకృతమై ఉన్న సూపర్ సైక్లోనిక్ తుఫాను ‘KYARR’, 11:30 గంటలకు 19.3N / 63.2E సమీపంలో కేంద్రీకృతమై క్రమంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఈ తుఫాను అక్టోబర్ 30 సాయంత్రం వరకు పడమర దిశగా వెళ్లి దక్షిణ ఒమన్ యెమెన్ తీరాలకు దూరంగా అడెన్ గల్ఫ్ వైపు వెళ్ళే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అయితే వచ్చే 24 గంటల వరకు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

ANI Update On Kyaarr Cyclone

క్యార్ తుఫాను ప్రభావంతో అరేబియా సముద్రం మీదుగా గంటకు 200-210 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. అక్టోబర్ 30, 31 నాటికి గాలుల తీవ్రత గంటకు 140 కిలోమీటర్లకు తగ్గుతుంది. కాబట్టి నవంబర్ 02 వరకు మత్స్యకారులెవ్వరూ అరేబియా సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

అక్టోబర్ 30 వరకు, కేరళలోని ఎర్నాకుళం, అలపుజ మరియు ఇడుక్కి జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీచేయబడింది మరియు త్రివేండ్రం, కొల్లం, త్రిశూర్, పాలక్కాడ్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది.

కాగా, హైదరాబాదు నగరంలో పలుచోట్ల మంగళవారం భారీ వర్షం కురిసింది. ఎల్బీనగర్, నాగోల్, కాప్రా, మన్సూరాబాద్, వనస్థలిపురం, బీఎన్ రెడ్డి నగర్, హయత్ నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్టా, అమీర్ పేట్, బేగంపేట్, మల్కాజ్ గిరి, కాప్రా, నాగారం, నేరేడ్ మెట్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో ఆయా ప్రాంతాల్లోని రోడ్లన్నీ జలమయ్యాయి. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని పలుచోట్ల ఓ మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.