New Delhi, May 24: దూసుకొస్తున్న ‘యాస్’ తుపాన్ దృష్ట్యా ముందుజాగ్రత్తగా మే 24 నుంచి మే 29వతేదీ వరకు 25 రైళ్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు ఈస్ట్రన్ రైల్వే ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుపాన్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని కేంద్ర వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర జారీ చేసిన హెచ్చరికలతో రైళ్ల రాకపోకలను (Eastern Railway Suspends 25 Trains) ముందుజాగ్రత్త చర్యగా నిలిపివేశారు.
పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల సముద్ర తీర ప్రాంతాల్లో యాస్ తుపాన్ (Cyclone Yaas) వల్ల గంటకు 165 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశముందని వాతావరణ శాఖ (IMD) జారీ చేసిన హెచ్చరికలతో రైళ్లను రద్దు రద్దు చేశారు.గౌహతి-బెంగళూరు కంటోన్మెంట్, ముజఫర్ పూర్- యశ్వంత్ పూర్, ఎర్నాకుళం-పాట్నా రైళ్లను రద్దు చేశారు. సిల్చార్, న్యూజల్పాయ్ గుడి, జయనగర్, పూరి, గౌహతి, పాట్నా, అగర్తలా మార్గాల్లో పలు రైళ్లను రద్దు చేసినట్లు ఈస్ట్రన్ రైల్వే (Eastern Railway) వెల్లడించింది.
ఇప్పటికే 59 రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ (Indian Railway) నిన్న మరిన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. నేటి నుంచి 30వ తేదీ మధ్య రైళ్లను నిలిపివేస్తున్నట్టు తెలిపింది.వీటిలో నిజాముద్దీన్, హౌరా, సంత్రగచ్చి, తిరువనంతపురం, చెన్నై సెంట్రల్, వాస్కోడిగామా, పాట్నా, పురులియా, కన్యాకుమారి, తాంబ్రం, యశ్వంత్‌పూర్ నుంచి బయలుదేరే రైళ్లు ఉన్నాయి. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఒక్కో రైలును ఒక్కో రోజు నిలిపివేస్తున్నట్టు రైల్వే తెలిపింది.
తూర్పు, మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా కదిలి సోమవారం నాటికి తుఫాన్‌గా మారనున్నది. తరువాత 24 గంటల్లో అతి తీవ్ర తుఫాన్‌గా మారుతుందని, 26న సాయంత్రం పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయుగుండం కారణంగా ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవుల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి.
దీని ప్రభావంతో 25-27 మధ్య ఒడిశా, పశ్చిమబెంగాల్, సిక్కింలోని పలు జిల్లాల్లో ఈ స్థాయిలో వర్షాలు కురవనున్నాయి. 26 మధ్యాహ్నం నుంచి తుపాను తీరం దాటేదాకా గంటకు 90-110 కి.మీ వేగంతో, తీరం దాటేటప్పుడు 155-165 నుంచి 185 కిలోమీటర్ల వరకు వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఆయా తేదీల్లో మధ్య, ఉత్తర బంగాళాఖాతం, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో సముద్రం అల్లకల్లోలంగా, అసాధారణంగా మారుతుందని తెలిపారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు.
దీని ప్రభావంతో తమిళనాడు రాష్ట్రంలో నాలుగు జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం వుందని స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ తుపాను కారణంగా సముద్రంలో పెనుగాలులు వీస్తాయని, తీరం వైపు ఉవ్వెత్తున అలలు ఎగసిపడతాయని తెలిపారు. తుపాను ప్రభావం కారణంగా నాలుగు రోజులపాటు జాలర్లు చేపలవేటకు వెళ్ళరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. యాస్ తుపాను ప్రభావంతో కన్నియాకుమారి, నీలగిరి, తేని, దిండుగల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీగాను, కుండపోతగాను వర్షాలు కురుస్తాయని తెలిపారు.
సేలం, కృష్ణగిరి, తిరుచ్చి, అరియలూరు, పెరంబలూరు, మదురై, తిరునల్వేలి, తెన్‌కాశి జిల్లాల్లో పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. సోమవారం కన్నియాకుమారి జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురిసే అవకాశముందని, సేలం, కృష్ణగిరి, ధర్మపురి, వేలూరు, రాణిపేట, తిరుపత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపారు. సోమ, మంగళవారాల్లో తుపాను కారణంగా తీరం పొడవునా గంటకు 50 నుండి 60 కి.మీ. వేగంతో పెనుగాలులు వీస్తాయని, జాలర్లకు చేపలవేటకు వెళ్ళకూడదని తెలిపారు. మన్నార్ జలసంధి ప్రాంతంలో బుధవారం గంటకు 55 నుంచి 65 కి.మీ. వేగంతో సుడిగాలులలు వీస్తాయని అధికారులు వివరించారు.
వాతావరణశాఖ హెచ్చరికలతో తుపాను ప్రభావిత రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. దీనిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా తుపానుపై సమీక్ష నిర్వహించారు. ప్రాణనష్టం జరగకుండా చూసుకోవాలని తీర ప్రాంత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు.
మరోవైపు తుపానును ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని ‘జాతీయ విపత్తు ఉపశమన దళం’ (ఎన్డీఆర్‌ఎఫ్) డైరెక్టర్ జనరల్ ఎస్.ఎన్.ప్రధాన్ తెలిపారు. తుపానును ఎదుర్కొనేందుకు నౌకాదళం, తీరగస్తీ దళం (కోస్ట్‌గార్డ్) అప్రమత్తమయ్యాయి. నాలుగు యుద్ధ నౌకలు, 11 సరకు రవాణా విమానాలు, 25 హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచినట్లు నేవీ ప్రకటించింది. ఆదివారం కోల్‌కతా, పోర్ట్‌బ్లెయిర్‌లకు 334 ఎన్డీఆర్‌ఎఫ్ దళాలను, 21 టన్నుల సామగ్రిని భారత వాయుసేన చేరవేసింది.
యాస్ తుఫానుతో ఒడిశాలో విధ్వంసం తప్పదని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. మయూర్‌భంజ్, భద్రక్, బాలాసోర్ జిల్లాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపింది. ఈ పరిస్థితుల్లో తుఫానును ఎదుర్కొనేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని కేంద్రం సూచించింది. తుఫాన్ ప్రభావంతో ఏపీలో నేడు, ఎల్లుండి వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలోనూ మోస్తరు వర్షాలు పడవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.