New Delhi, May 23: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం యాస్ తుపానుగా మారి కల్లోలం రేపుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష (PM Narendra Modi Reviews Preparedness of States) నిర్వహించారు. టెలికాం, విద్యుత్, విమానయానం తదితర శాఖల అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అధికారులకు పలు సూచనలు చేశారు. సకాలంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని, వారికి భరోసా, ధైర్యాన్ని కల్పించాలని సూచించారు.
వీటితో పాటు విద్యుత్ అంతరాయాలను తొలగించి, సకాలంలో స్పందించాలని కోరారు. ఆయా రాష్ట్రాలతో కలిసి పనిచేయాలని, ఎక్కువగా ఇబ్బందులున్న ప్రాంతాల్లో్ని ప్రజలను మొదట సురక్షిత ప్రాంతాలకు తరలించాని సూచించారని పీఎంవో పేర్కొంది. అలాగే సముద్రపు ఒడ్డున ఉంటూ రోజు వారి కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని పేర్కొన్నారని పీఎంవో పేర్కొంది. మరో వైపు సహాయ సహకారాలతో పాటు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి గాను 46 ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని నియమించగా, ఇప్పటికే హెలికాప్టర్లరో 13 టీములను పంపించారు. మరోవైపు నేవీ కూడా తమ షిప్పులను, హెలికాప్టర్లను రంగంలోకి దింపింది.
కాగా తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఇది ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తూ రేపటికి తుపాను (యాస్)గా (Cyclone Yaas) మారుతుందని, ఆపై రాగల 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారుతుందని ఐఎండీ పేర్కొంది. యాస్ తుపాను ఈ నెల 26వ తేదీ ఉదయం ఒడిశా-పశ్చిమ బెంగాల్ మధ్య తీరాన్ని తాకుతుందని, సాయంత్రానికి తీరాన్ని దాటి భూభాగంపై ప్రవేశిస్తుందని ఐఎండీ తాజా బులెటిన్ లో వెల్లడించింది.
అయితే, యాస్ తుపాను ప్రభావం ఏపీ, తెలంగాణపై కొద్దిమేర మాత్రమే ఉంటుందని తెలిపింది. రేపు ఉదయం కోస్తాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఉత్తరాంధ్రలో చెదురుమదురు జల్లులు కురుస్తాయని పేర్కొంది. తుపాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని స్పష్టం చేసింది. నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయని, ప్రస్తుతం తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు వ్యాపించి ఉన్నాయని ఐఎండీ తెలిపింది.
ఈ నెల 26న ఒడిషా - బెంగాల్ మధ్య తుపాను తీరం దాటనున్న నేపథ్యంలో 46 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను కేంద్రం సిద్ధం చేసింది. తీరం దాటే సమయంలో గంటకు 185 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో సహాయ చర్యల కోసం నేవీ.. షిప్‌లు, హెలికాప్టర్లు సిద్ధం చేసింది.