New Delhi, May 26: బంగాళాఖాతంలో ఏర్పడిన అతి తీవ్ర తుపాను యాస్ (Cyclone Yaas) బుధవారం ఉదయం ఒడిశాలో తీరాన్ని తాకింది. ఒడిశాలోని భద్రక్ జిల్లాలోని ధామ్రా ఓడరేవు సమీపంలో తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైందని వాతావరణ విభాగం(IMD) వెల్లడించింది. తుపాను పరిమాణం భారీగా ఉండటంతో.. తీరాన్ని దాటే ప్రక్రియ ముగియడానికి కొన్ని గంటలు పట్టనుందని తెలిపింది. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పూర్తిగా తీరాన్ని దాటుతుందని ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమిషనర్ పీఏ జెనా తెలిపారు. ఈ తుఫాను (Cyclone Yaas Impact) ధాటికి తీరప్రాంతంలోని జిల్లాల్లో 140 నుంచి 155 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
జగత్‌సింగ్‌పూర్, కేంద్రపారా, జజ్‌పూర్, భద్రక్, బాలాసోర్, కటక్, ధేన్కనాల్ వంటి ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు(200మీమీ కంటే ఎక్కువ) కురవనున్నాయని వాతావరణ విభాగం అంచనా వేసింది. అలాగే పూరి, ఖుద్రా, ఆంగల్, డియోగఢ్, సుందర్‌గఢ్ జిల్లాల్లో భారీగా వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ రోజు ఉదయం యస్ తీరాన్ని సమీపిస్తుండగా..పర్బా మేదినిపుర్ జిల్లాలో సముద్రంలో అలలు ఉద్ధృతి పెరిగింది. సైక్లోన్ ప్రభావంతో ఒడిశాలోని ధామ్రా జిల్లాలో బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి.
వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో..గురువారం ఉదయం ఐదు గంటల వరకు భువనేశ్వర్‌లోని విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు మంగళవారం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ తెలిపింది. అలాగే ఈరోజు ఉదయం 8.30 నుంచి గురువారం ఉదయం ఐదు గంటల వరకు కోల్‌కతాలోని విమానాశ్రయంలో కార్యకలాపాలను నిలిపివేశారు. అలాగే ఈ సైక్లోన్ కారణంగా ఇప్పటికే ఇద్దరు మృతి చెందినట్లు, సమీప ప్రాంతాల్లో ఇళ్లు ధ్వంసమైనట్లు అధికారులు చెప్తున్నారు.
ఒడిశా, పశ్చిమ్ బెంగాల్‌లోని పలు జిల్లాలపై తుపాను ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు చేపడుతున్నాయి. బెంగాల్ తీర ప్రాంతాల నుంచి 9లక్షల మందిని, ఒడిశా నుంచి సుమారు 3లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Cyclone Yaas Live Tracker
సైక్లోన్ యస్ ప్రభావంతో అస్సాం, మేఘాలయలో కూడా భారీ వర్షపాతం ఉంటుందని గువహటి ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దాంతో రెండు రాష్ట్రాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ను జారీ చేసింది. తుఫాను ధాటికి ఒడిశా, పశ్చిమబెంగాల్ తీర ప్రాంతాలు (Cyclone Yaas Hits Odisha, West Bengal on High Alert) చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఉప్పెన వచ్చి ఏ ఊరిమీద పడుతుందోనని ప్రజలు క్షణ క్షణం భయం భయంగా గడుపుతున్నారు. దీంతో ఒడిశా ముఖ్యమంత్రి పట్నాయక్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అధికారులను అప్రమత్తం చేశారు. తీర, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.