Nivar Cyclone: తీరాన్ని తాకిన నివర్ తుఫాను, అయినా పొంచి ఉన్న పెనుముప్పు, తమిళనాడు, ఏపీలో అతి భారీ వర్షాలు, పలు రైళ్ల రాకపోకలు రద్దు, తిరుమలలో విరిగిపడిన కొండ చరియలు

Chennai, Nov 26: నివర్‌ తుపాను పుదుచ్చేరి సమీపాన బుధవారం అర్ధరాత్రి తీరాన్ని (Nivar Cyclone) తాకింది. ఇది పుదుచ్చేరికి సమీపంలో తీవ్ర తుపాను నుంచి అతి తీవ్ర తుపానుగా (severe cyclonic storm) పరిణమించింది. బుధవారం రాత్రి 11.30 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున 2.30 గంటల మధ్య నివర్‌ తుపాను (Cyclonic Nivar) తీరం దాటినట్లు వాతావరణశాఖ తెలియజేసింది. తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాలకు ఈ తుఫాను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. తుపాను తీరం దాటాక గంటకు 120 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు వివరించారు.

తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో తుపాన్‌ ప్రభావంతో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. పుదుచ్చేరిలో లక్ష మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు 50 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. తుఫాను ప్రభావంతో తమిళనాడులోని తిరువణ్ణామలై, కడలూర్, కల్లకురిచ్చి, విలుప్పుంలలో మరో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. తుఫాను తీరం దాటే సమయంలో వీచిన గాలులకు భారీ వృక్షాలు నెలకొరిగాయి. పంటలకు భారీ నష్టం వాటిల్లింది.

తుఫాన్ అనంతరం ఏర్పడిన పరిస్థితులను ఎదుర్కొనడానికి తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగాయి. జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. నేలకొరిగిన చెట్లను తొలగించే పనిలో పడ్డాయి. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. తీర ప్రాంత జిల్లాల్లో సహాయక చర్యల కోసం ముందు జాగ్రత్త చర్యగా వందలాది మంది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలను దింపారు. వారంతా ఇప్పుడు సహాయక, పునరావాస చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

Here's NDRFteams at work near Indira Statue in Pondicherry

నివర్‌ తుపాను నేపథ్యంలో కృష్ణపట్నం, నిజాంపట్నం, మచిలీపట్నం ఓడరేవు పోర్టులో లోకల్ సిగ్నల్ మూడో నెంబర్ ప్రమాద సూచికను ఎగరవేయగా, విశాఖపట్నంలో డిస్టెన్స్ వార్నింగ్ సిగ్నల్ రెండో నెంబర్‌, కాకినాడ గంగవరం పోర్టులో నాలుగో నెంబర్ ప్రమాద సూచికలు ఎగురవేశారు. కాగా తీవ్రమైన నివర్ తుపాను క్రమంగా బలహీనపడుతూ నేటి సాయంకాలానికి వాయుగుండంగా మార్పు చెందనున్నట్లు సమాచారం.

Here's Effect visuals

తుపాన్‌ తీరం దాటే సమయంలో భారీగా పెనుగాలు వీచడంతో పెద్ద సంఖ్యలో వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. మరో ఆరుగంటల్లో తుపాన్‌గా మారనుంది. రెండు రాష్ట్రాల్లో తుపాన్‌ ప్రభావంతో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. పుదుచ్చేరిలో లక్ష మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు 50 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.

నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, నెల్లూరు, కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. సత్యవేడులోని పలు మండలాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాన్ ప్రభావిత జిల్లాల్లో పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు.

భారీ వర్షాలతో వణికిపోతున్న ఏపీ, తమిళనాడు రాష్ట్రాలు, తీవ్ర తుఫానుగా మారిన నివర్, తమిళనాడులో పలుచోట్ల 12 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు, రాత్రికి తీరం దాటే అవకాశం

నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. చెన్నై సెంట్రల్‌- తిరుపతి రైలు రైల్వే శాఖ రద్దు చేసింది. అలాగే హైదరాబాద్‌- తంబరం, మదురై- బికనీర్‌ రైళ్లు రద్దు అయ్యాయి. తుఫాన్‌ ప్రభావంతో పలు రైళ్లను దారి మళ్లించారు.

తిరుమలలోని కనుమ దారిలో కొండచరియలు విరిగిపడ్డాయి. రెండో కనుమ దారి హరిణి ప్రాంతంలో బండరాళ్లు విరిగిపడ్డాయి. 14వ కిలో మీటర్‌ దగ్గర భక్తులు వెళ్తున్న కారుపై బండరాళ్లు విరిగిపడ్డాయి. కాగా కారులో ప్రయాణిస్తున్న భక్తులు సురక్షితంగా బయటపడ్డారు. బండరాళ్లు పడటంతో కారు ముందుభాగం ధ్వంసమైంది. సమాచారం అందిన వెంటనే అధికారులు అక్కడకు చేరుకుని జేసీబీల సాయంతో బండరాళ్లను తొలగిస్తున్నారు.