Bhopal, April 25: దక్షిణాఫ్రికా (South Africa) నుంచి మధ్యప్రదేశ్‌లోని (Madhyapradesh) కునో నేషనల్ పార్కుకు (Kuno National Park) తీసుకొచ్చిన చీతాల్లో రెండు ప్రాణాలు కోల్పోయిన సంగతి విదితమే. నెల రోజుల్లోనే ఇవి ప్రాణాలు కోల్పోయాయి. ఈ నేపథ్యంలో చీతాలను ఉంచడానికి కునో జాతీయ పార్కుకు ప్రత్యామ్నాయంగా మరో ప్రదేశాన్ని ఎంపిక చేయాలని మధ్యప్రదేశ్ అటవీశాఖ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ పార్కు పులుల ఆవాసానికి, గణనకు, సంరక్షణకు అనువుగా లేదని మధ్యప్రదేశ్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ జేఎస్ చౌహాన్ తెలిపారు. ఈ ప్రదేశాన్నే గాంధీనగర్ అభయారణ్యం, నౌరాదేహి వన్యప్రాణి అభయారణ్యంగా అభివృద్ధి చేద్దామంటే రెండు, మూడేళ్లు పడుతుందని అధికారులు చెబుతున్నారు. గత సెప్టెంబర్ నుంచి నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి ఇక్కడకు తెచ్చిన 8, 12 చీతాల నివాసానికి కునో జాతీయ పార్కు ఆమోదయోగ్యంగా లేదని అన్నారు.
చీతాలను 24 గంటల పాటూ పరిశీలించడానికి తమకు 9 మంది కావాలని, కాని సరిపడా సిబ్బంది లేరని చెప్పారు. దక్షిణాఫ్రికా నుంచి ఫిబ్రవరిలో తెచ్చిన ఉదయ్ అనే చీతా ఆదివారం మృతి చెందిందని, ఈ నెలలో ఇది రెండో చీతా మరణమని ఆయన చెప్పారు. 747 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్న కునో నేషనల్ పార్కులో తటస్థ ప్రాంతం 487 చదరపు కిలోమీటర్లు ఉందన్నారు.
ఈ పార్కు పరిధి వాటి సంచారానికి చాలదని, చుట్టుపక్కల ప్రాంతాలలో గ్రామాలున్నందున వీటి సంచారానికి ఇబ్బంది కలుగుతుందని, అలాగే ఆయా గ్రామాలు ప్రజలకు ప్రాణాపాయం ఉంటుందని వారు పేర్కొన్న సంగతిని గుర్తు చేశారు.చీతాల అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా 20 చీతాలను విదేశాల నుంచి కునో నేషనల్ పార్కుకు తెప్పించారు. అయితే వీటిలో ఇప్పటికే రెండు మృతి చెందగా, సియయా అనే చీతా మార్చిలో 4 పిల్లలకు జన్మనిచ్చింది.