International Flights: వచ్చే నెలలో అంతర్జాతీయ విమాన సర్వీసులు, ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ పూరి
Hardeep Singh Puri (Photo Credits: ANI)

New Delhi, June 16: దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు (coronavirus) పెరుగుతుండటంతో అంతర్జాతీయ విమాన సర్వీసుల (International Flights) నిలిపివేత కొనసాగుతోంది. లాక్‌డౌన్‌కు భారీ సడలింపులు ప్రకటించిన క్రమంలో అంతర్జాతీయ విమాన రాకపోకలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు సాగిస్తోంది. వచ్చే నెలలో అంతర్జాతీయ విమాన సర్వీసులు పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ పూరి (Hardeep Singh Puri) వెల్లడించారు. మంగళవారం మాట్లాడుతూ జులైలో అంతర్జాతీయ విమానాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేసున్నామని, కచ్చితమైన తేదీని ప్రకటించలేమని తెలిపారు. సరిహద్దుల్లో దాడులతో బరితెగించిన చైనా, భారత ఆర్మీ కల్నల్ సహా ఇద్దరు జవాన్లు మృతి, కొనసాగుతున్న రెండు దేశాల మేజర్ జనరళ్ల మధ్య చర్చలు

ఇందుకు వాటాదారులు, వినియోగదారులకు నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే నెలలో విమాన సర్వీసులు నడుపుతామనే నమ్మకం కూడా ఉందనీ, స్పష్టమైన తేదీని ప్రకటించలేమని చెప్పారు. కాగా, దేశీయ విమానాలు తిరిగి ప్రారంభమైన రోజు నుంచి ఈ నెల 15వరకు 1,35,954 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చామని, ఇందుకు 1,464 విమాన సర్వీసులను వినియోగించినట్లు పేర్కొన్నారు.

ప్రయాణీకులు, ఎయిర్‌లైన్స్‌ సహా అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణపై ఓ నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. కాగా ఎయిర్‌పోర్ట్‌ల్లో విమానాల సంఖ్యపై పరిమితులతో మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులను అనుమతించిన సంగతి తెలిసిందే.