Air Pollution (Credits: X)

New Delhi, Oct 25: దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) మళ్లీ ఎక్కువైంది. పొరుగు రాష్ట్రాల్లో వ్యర్థాలను తగులబెడుతుండడంత దేశ రాజధానిలో కాలుష్యం పెరిగింది. ఎన్ని క‌ఠిన‌ చ‌ర్యలు తీసుకుంటున్నా కాలుష్యం మాత్రం త‌గ్గడంలేదు.దీనికి తోడు పొగమంచు కూడా రాజధాని ప్రాంతాన్ని ఆవహించింది. దీంతో నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (Air Quality Index) త‌క్కువ‌గా ఉన్నట్లు కాలుష్య నియంత్రణ మండ‌లి (Central Pollution Control Board) పేర్కొంది.

శుక్రవారం ఉదయం 8 గంటలకి గాలి నాణ్యత 283 వద్ద నమోదైనట్లు తెలిపింది. ఆనంద్‌ విహార్‌లో 218, పంజాబీ బాగ్‌లో 245, ఇండియా గేట్‌ పరిసర ప్రాంతాల్లో 276, జిల్మిల్‌ ఇండస్ట్రియల్‌ ఏరియాలో 288గా ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ నమోదైంది. గత రెండు రోజులుగా రాజధానిలో కాలుష్యం పెరిగిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. కాలుష్యం కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు వాపోతున్నారు.

ఊపిరి పీల్చుకున్నట్లే ఇక, ఎట్టకేలకు తీరం దాటిన ‘దానా’ తుపాను, ఒడిషాలో కొనసాగుతున్న భారీ వర్షాలు, స్కూళ్లకు సెలవులు

ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ వెదర్‌ ఫోర్‌కాస్టింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ నివేదిక ప్రకారం.. గాలి నాణ్యత 447కు పడిపోవడం అంటే దాన్ని తీవ్ర వాయు కాలుష్యంగా పరిగణించవచ్చు. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (AQI) 0-100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి, కాలుష్యం లేదని, AQI 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా ఉందని అర్థం.

ఇక AQI 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని, AQI 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉందని, AQI 400-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని అర్థం చేసుకోవచ్చు. కాగా, ఈ మధ్య ఢిల్లీలో వాయు కాలుష్యం ఆందోళనకరంగా మారుతున్న విషయం తెలిసిందే.

తాజాగా ఢిల్లీలో వాయు కాలుష్యంపై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ (DY Chandrachud) ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా మార్నింగ్ వాక్‌కు వెళ్లడం మానేసినట్లు తెలిపారు. ‘నేటి నుంచి నేను మార్నింగ్‌ వాక్‌కు వెళ్లడం మానేశా. సాధారణంగా నేను ఉదయం 4 నుంచి 4.15 మధ్య వాకింగ్‌కు వెళ్తాను.

ప్రస్తుతం బయటి వాతావరణంలో గాలి నాణ్యత బాగా పడిపోయింది. దీంతో ఉదయాన్నే బయటకు వెళ్లకపోవడమే మంచిదని నా వ్యక్తిగత వైద్యుడి సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇంట్లోనే ఉండటం ద్వారా శ్వాసకోశ వ్యాధులకు దూరంగా ఉండొచ్చు’ అని సీజేఐ తెలిపారు. డీవై చంద్రచూడ్‌ నవంబర్‌ 10న పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే. ఆయన 2022 నవంబర్‌ 8 నుంచి ఈ పదవిలో ఉన్నారు.

చంద్రచూడ్‌ తర్వాత భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నియమితులయ్యారు. ఆయన నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. నవంబర్‌ 11న సంజీవ్‌ ఖన్నా ప్రమాణ స్వీకారం చేస్తారు. సంజీవ్‌ ఖన్నా ఈ పదవిలో ఆరు నెలలు మాత్రమే ఉంటారు. ఆయన 2025 మే 13న పదవీ విరమణ చేస్తారు.