New Delhi, Oct 18: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో (Delhi Excise Policy Scam Case) డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపించింది. ఇప్పటికే అరెస్టు అయిన విజయ్ నాయర్, సమీర్ మహేంద్ర, అభిషేక్ రావు తదితరులు ఇచ్చిన సమాచారం ఆధారంగా సీబీఐ విచారణ కొనసాగుతుంది. మద్యం విధానం, లైసెన్స్‌ల వ్యవహారంపై సీబీఐ ఫోకస్ పెట్టింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియాను (Deputy CM and AAP leader Manish Sisodia) సీబీఐ సోమవారం తొమ్మిది గంటల పాటు ప్రశ్నించింది.
అనంతరం సిసోడియా మీడియాతో మాట్లాడుతూ సీబీఐ అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు. విచారణ పేరుతో ఆప్‌ను వీడాలని అధికారులు తనపై తీవ్ర ఒత్తిడి చేశారని, ఢిల్లీ సీఎం పోస్టు కూడా ఆఫర్ చేశారని, లేకుంటే జైలుకు పంపిస్తామని బెదిరించారని తెలిపారు. అసలు ఎక్సైజ్ పాలసీలో స్కామే లేదని, ఇది తప్పుడు కేసు అని సీబీఐ విచారణ తీరును బట్టి గుర్తించానని తెలిపారు.
ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వైదొలగాల్సిందిగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చేసిన వాదనలను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI Refutes Sisodia's "quit AAP" Claims) సోమవారం ఖండించింది. ప్రొఫెషనల్ మరియు లీగల్ పద్ధతిలో' పరీక్ష జరిగిందని సీబీఐ పేర్కొంది. చట్ట ప్రకారం విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. సిసోడియా, సిబిఐ కార్యాలయంలో విచారణ సందర్భంగా తనను ఆప్ నుండి వైదొలగాలని అడిగారని ప్రశ్నించిన తర్వాత సీబీఐ అధికారులు పై విధంగా స్పందించారు.
ఈ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని కూడా ప్రశ్నించినట్టు సీబీఐ అధికారులు వెల్లడించారు. సీబీఐ విచారణకు హాజరయ్యేముందు సిసోడియా ఆప్ కార్యాలయంలో మాట్లాడారు. గుజరాత్‌లో ఆప్‌కు వస్తున్న ప్రజాదరణను చూసి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి భయం పట్టుకున్నదని అన్నారు. అందుకే మోదీ సర్కార్ ఆప్‌పై కక్ష కట్టిందని, తనపై తప్పు డు కేసు బనాయించిందని, జైలుకు పంపాలని కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. తాను అరెస్టుకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
సిసోడియాను కేసులో ఇరికించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఆప్ నేతలు ఢిల్లీలోని సీబీఐ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఎంపీ సంజయ్ సింగ్‌తో సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు గుజరాత్‌లోని మెహసాణా జిల్లాలోని ఉంఝాలో జరిగిన ర్యాలీలో ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో సిసోడియాను పాల్గొననివ్వకుండా అడ్డుకోవాలని బీజేపీ చూస్తున్నదని అన్నారు. ఇందులో భాగంగా ఆయన్ను త్వరలో అరెస్టు చేయిస్తుందని పేర్కొన్నారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మంగళవారం సైతం సోదాలు చేపట్టింది. రుణాల ఎగవేత, నకిలీ ఇన్వాయిస్‌లతో మోసం చేసినట్లు వచ్చిన ఆరోపణలతో హైదరాబాద్ ఎంబీఎస్ జ్యువెలరీలో ఈడీ అధికారులు మంగళవారం ఉదయాన్నే తనిఖీలు చేపట్టారు. ఎంబీఎస్ జ్యువెలరీ బ్యాంకు లావాదేవీలు, వాల్యూయేటర్ ద్వారా గోల్డ్ వంటి వాటిపై సోదాలు చేపట్టారు. ఈడీకి చెందిన 20 బృందాలు ఎంబీఎస్ జ్యువెలరీ షోరూముల్లో తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. మరోవైపు.. విజయవాడలోనూ ఈడీ, ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. బిగ్‌సీ అధినేత సాంబశివరావు ఇంట్లో ఆదాయపన్ను శాఖ (ఐటీ) తనిఖీలు చేపట్టింది. హార్డ్‌డిస్క్‌లు, డాక్యుమెంట్లు తనిఖీ చేశారు ఐటీ అధికారులు. హానర్ హోమ్స్‌లో రూ.360 కోట్ల లావాదేవీలపై ఐటీ విచారణ చేపట్టింది.