New Delhi, FEB 18: ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్ ఏరియాలో తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తి చేతిలోనే దారుణంగా హత్యకు గురైన నిక్కీ యాదవ్ (Nikki Yadav).. హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాహిల్ గెహ్లోత్ (Sahil Gehlot).. ఛార్జింగ్ కేబుల్ (charging cable)తో నిక్కీ మెడకు ఉరి బిగించి హత్య చేసినట్లు పోలీసు విచారణలో ఇప్పటికే వెల్లడైంది. అయితే వీరిద్దరూ సహజీవనంలో ఉన్నారని.. తనని కాదని సాహిల్ వేరే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవ్వడంతో ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుందంటూ ఇప్పటి వరకు వార్తలు వచ్చాయి. అయితే అందులో నిజం లేదని తాజాగా పోలీసులు వెల్లడించారు. నిక్కీ-సాహిల్‌కు 2020 అక్టోబర్‌లోనే వివాహం జరిగిందని పోలీసులు తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) నోయిడా (Noida)లోని ఆర్యసమాజ్ (Arya Samaj temple)లో వీరి వివాహం జరిగినట్లు చెప్పారు. వీరి వివాహ ధ్రువపత్రాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
అయితే వీరి పెళ్లి సాహిల్ కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని పోలీసులు తెలిపారు. నిక్కీ హత్యలో సాహిల్‌తోపాటు అతడి కుటుంబ సభ్యులు, స్నేహితులు పాత్ర కూడా ఉందని విచారణలో భాగంగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో నిందితుడి తండ్రి వీరేంద్ర సింగ్, సోదరులు అనీష్, నవీన్, స్నేహితులు లోకేశ్, అమర్‌ను శుక్రవారం సాయంత్రం ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు (Delhi Police Crime Branch ) అదుపులోకి తీసుకున్నారు. నిక్కీ యాదవ్ (23).. సాహిల్ గెహ్లాట్ అనే వ్యక్తితో గత కొంతకాలంగా సహజీవనం చేస్తోంది. తాజాగా అది సహజీవనం కాదు.. వారికి ఇదివరకే వివాహం జరిగిందని పోలీసు విచారణలో వెల్లడైంది. అయితే సాహిల్ గెహ్లాట్.. నిక్కీని కాదని మరో యువతితో పెండ్లికి రెడీ అయ్యాడు. విషయం తెలుసుకున్న నిక్కీ.. సాహిల్‌ని నిలదీసింది. ఈ విషయమై తమ ఫ్లాట్‌కు సమీపంలోనే కారులో ఇద్దరూ గొడవపడ్డారు. దాదాపు మూడు గంటలపాటు వారి గొడవ జరిగింది.
ఈ క్రమంలో గొడవ ముదరడంతో సాహిల్ డాటా కేబుల్‌తో నిక్కీ మెడకు ఉరి బిగించి చంపేశాడు. అయితే, హత్య అనంతరం మృతదేహాన్ని ఏం చేయాలో తెలియయ స్నేహితుల సాయంతో అదే కారులో వారి దాబాకు తీసుకెళ్లాడు. అక్కడ ఫ్రిడ్జ్‌లో దాన్ని దాచేశాడు. కారులో గొడవను గమనించిన పక్క ఫ్లాట్ వ్యక్తి నిక్కీ యాదవ్ కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా సాహిల్ చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. దాంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు.