New Delhi, March 14: దేశ రాజధాని ఢిల్లీలోని (Delhi) కొన్ని ప్రాంతాల్లో శనివారం ఉరుములు, మెరుపులతో భారీ వడగళ్ల వాన కురిసింది. ఉదయం నుంచి మేఘావృతమై, మధ్యాహ్నం పెద్ద ఎత్తున వర్షం కురిసింది. కొన్ని చోట్ల వడగళ్ళు పడ్డాయి. వడగళ్లతో రోడ్లపై ఉన్న జనం బెంబేలెత్తిపోయారు. అయితే, ఎండవేడిమి, ఉక్కపోతతో సతమతమైన ఢిల్లీ ప్రజలకు ఈ వర్షంతో చల్లని వాతావరణం లభించినట్టయింది. అక్కడ భారీగా ట్రాఫిక్ జాం (Traffic Jams) ఏర్పడింది.
యూపీని ముంచెత్తిన వడగండ్ల వాన, 28 మంది మృతి
ఈ కాలంలో నమోదయ్యే సగటు ఉష్ణోగ్రత కన్నా కాస్త ఎక్కువగా శనివారం 16.4 డిగ్రీల సెల్సియస్ శనివారం నమోదయిందని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం 8.30 గంటలకు తేమ శాతం 88 శాతంగా నమోదైందని తెలిపింది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం మళ్ళీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 27 డిగ్రీలుగా ఉండవచ్చునని వివరించింది.
ఇప్పటికే యూపీని అనుకోని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గడచిన 24 గంటల్లో 28 మంది మృతి చెందారని అధికారులు శుక్రవారం వెల్లడించారు. మరణించిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. గోడలు కూలడం, చెట్లు పడిపోవడం, పిడుగులు పడటం వంటి కారణాల వల్ల వీరంతా మృతి చెందినట్లు తెలిపారు. పిలిబిత్, సీతాపూర్, చాందౌలీ, ముజాఫర్‌నగర్, భాగ్‌పట్, బిజ్‌నోర్, ఔన్‌పూర్ జిల్లాలపై వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది.
మరణించిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల ఆర్థిక సహాయం అందించాలంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Chief minister Yogi Adityanath) అధికారులను ఆదేశించారు. పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. పంట, పశువుల నష్టాన్ని అంచనా వేయాలని.. బాధితులకు తక్షణమే పరిహారం అందించాలని ఆదేశించారు. వర్షాలకు తోడు గాలిదుమ్ముల కారణంగా గోధుమలు, ఆవాలు పంటలు బాగా దెబ్బతిన్నాయి. బంగాళా దుంపల పంటలకు కూడా నష్టం వాటిల్లింది.