New Delhi, July 18: ఓ వ్యక్తిని కత్తితో పొడిచి చంపినందుకు గాను 20 ఏళ్ల మహిళను, ఆమె సహచరుడిని ఢిల్లీ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. భర్త చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి మహిళపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడనే దానికి ప్రతీకారంగానే ఈ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఈశాన్య) జాయ్ టిర్కీ మాట్లాడుతూ జూన్ 16న ఉదయం 8:34 గంటలకు శాస్త్రి పార్క్‌లోని బేలా ఫామ్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులకు సమాచారం అందింది. మెడ, పొత్తికడుపుపై పదునైన ఆయుధ గాయాలతో చొక్కా లేని ఒక వ్యక్తి శరీరం సంఘటన స్థలంలో కనుగొనబడింది" అని DCP తెలిపారు. మృతుడిని అబుజర్ (20)గా పోలీసులు గుర్తించారు. దాదాపు 20 సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన అనంతరం ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఈశాన్య ఢిల్లీ వాసి అయిన ఓ మహిళ భర్త ఈ ఏడాది జనవరిలో అనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటి నుంచి ఆ మహిళ ఒంటరిగా ఉంటోంది. ఆమె ఒంటరితనాన్ని అలుసుగా తీసుకున్న స్థానిక వ్యక్తి ఆమె ఇంట్లో చొరబడి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కూడా మళ్లీమళ్లీ ఆమెపై అత్యాచారానికి పాల్పడుతూనే ఉన్నాడు.
దాంతో బాధిత మహిళ ఈ విషయాన్ని తన స్నేహితురాలికి చెప్పింది. ఆమె తన భర్త దృష్టికి తీసుకెళ్లడంతో అతను సానుభూతి చూపించాడు. అనంతరం బాధిత మహిళ అభ్యర్థన మేరకు ఆ రేపిస్టును హతమార్చేందుకు ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇద్దరూ కలిసి అతడిని బేలా ఫార్మ్ దగ్గరకు రప్పించారు. అతడు రాగానే ఇద్దరూ కత్తులతో దాడి చేసి హతమార్చారు.
అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఆదివారం ఉదయం స్థానికులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా ప్రాంతానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ పుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.