Hyderabad, January 7: ఇటీవల కాలంలో నిరాశ, ఒత్తిడి, ఆందోళనలు (Depression, Anxiety) యువతను తీవ్రంగా వేధిస్తున్న సమస్య. అనుకున్న పనులు జరగడం లేదని, నిరుద్యోగం, పరీక్షలు- పోటీ, బాహ్య సౌందర్యం ఇలా ఎన్నో కారణాలతో రోజును సంతోషంగా గడపడం లేదు. తనకున్న సమస్యలను ఇతరులతో పోల్చిచూసుకోవడం ద్వారానో, లేదా సమాజం తనను చిన్నచూపు చూస్తుందమోనన్న ఆత్మన్యూనత భావంతో చాలా మంది నేటి యువత తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇందులో జుట్టు రాలిపోవడం కూడా నేటి యువతకు అతిపెద్ద సమస్యగా పరిణమించింది. ఈ మధ్య 30 ఏళ్లకే బట్టతల రావడం, జుట్టు తెలబడటం గమనిస్తున్నాం.
అయితే 18 ఏళ్లకే జుట్టు రాలిపోయి (Hair loss), బట్టతల (Bald head) వస్తుందని తీవ్ర ఆందోళన చెందిన ఓ 18 ఏళ్ల టీనేజర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఓ కార్పోరేట్ సంస్థలో ఉద్యోగం చేసే ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి కొండాపూర్ లోని ఒక అపార్టుమెంటులో నివాసం ఉంటున్నారు. పెద్ద కుమారుడు ఎంబీఏ చదువుతుండగా, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన చిన్నకుమారుడు (18) ఇంటివద్దే ఉంటూ జేఈఈకి ప్రిపేర్ అవుతున్నాడు. ఇతడికి చిన్నప్పటి నుంచే సైనస్ సమస్యతో పాటు, ఇతర ఆనారోగ్య సమస్యలు ఉన్నాయి. దీనికి తోడు గత 6 నెలల నుంచి జుట్టు రాలిపోవడం ప్రారంభమైంది. దీంతో తనకే ఎందుకిలా జరుగుతుందని తీవ్ర మనోవేదనకు గురైన ఆ టీనేజర్ సోమవారం స్నానానికి అని బాత్ రూంకు వెళ్లి, అక్కడే బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబాన్ని బలి తీసుకున్న ఆన్‌లైన్ లాటరీ, చనిపోతూ సెల్పీ వీడియో తీసుకున్న కుటుంబం
కొడుకు ఎంతసేపటికి రావడం లేదని బాత్ రూం తలుపులు బద్దలుకొట్టి చూడగా అప్పటికే ఉరి వేసుకొని ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. బట్టతల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆ యువకుడు రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం అతడి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.