Jaisalmer, November 14: ప్రతి ఏడాది మాదిరిగానే ప్రధాని మోదీ దీవపాళి వేడుకలను (Diwali 2020) సైనికులతో జరుపుకున్నారు. రాజస్థాన్ జైసల్మేర్ సమీపంలో ఉన్న లాంగేవాలాలో బీఎస్ఎఫ్ జవాన్లు, సైనికులతో దీపావళి పండుగ (PM Narendra Modi Celebrates Diwali With Defence Personnel) జరుపుకున్నారు. ప్రధానితోపాటు డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ నరవణే, బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ రాకేశ్ ఆస్తానా కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. గతేడాది దిపావళిని జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో ఉన్న నియంత్రణ రేఖ వద్ద సైనికులతో జరుపుకున్న విషయం విదితమే.
ప్రధాని మోదీ మొదటిసారిగా 2014లో సియాచిన్‌లో సైనికులతో ( Indian Soldiers) జరుపుకున్నారు. ఆ ఆనవాయితీని గత ఏడేండ్లుగా కొనసాగిస్తున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదేవిధంగా సైనికులతో దీపావళిని జరుపుకునేవారు. 2018లో ఉత్తరాఖండ్ సరిహద్దు సైనికులతో కలిసి మోదీ (PM Narendra Modi) దీపావళి పండుగను జరుపుకున్నారు. 2017లోనూ ఉత్తర కాశ్మీర్‌లోని గురేజ్ సెక్టార్‌లో సైనికులతో కలిసి ప్రధాని మోదీ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు
PM Narendra Modi Addresses Soldiers at Longewala Post on Diwali:
India is proud of our forces, who protect our nation courageously. https://t.co/3VyP0WusDf
— Narendra Modi (@narendramodi) November 14, 2020
ఈ సందర్భంగా పీఏం మాట్లాడుతూ.. సైనికులతో ఉన్నప్పుడే నాకు నిజమైన దీపావళి అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. వీరమరణం పొందిన జవాన్లను నివాళులు అర్పించిన మోదీ..ప్రజలంతా దీపాలు వెలిగించి దేశాన్ని కాపాడుతున్న సైనిక వీరులకు వందనం చేయాలని పిలుపునిచ్చారు. దేశ రక్షణ కోసం సైనికులు ప్రదర్శిస్తున్న ధైర్య సాహసాలకు కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు సరిపోవన్నారు. జవాన్ల కోసం స్వీట్లు, దేశ ప్రజల ప్రేమ తీసుకువచ్చానంటూ మోదీ వ్యాఖ్యానించారు.
మీరు మంచు కురిసే ప్రాంతంలో ఉన్నా... ఎత్తైన పర్వత సానువుల్లో ఉన్నా... లేదంటే ఎడారి ప్రాంతంలో ఉన్నా... ఎక్కడున్నా... మీ మధ్యలో దీపావళి జరుపుకుంటేనే నాకు దీపావళి పండగలా అనిపిస్తుంది. మీ మొహాల్లో ఆనందం చూసినప్పుడు నా ఆనందం ద్విగుణీకృతమవుతుంది. మీరుంటేనే దేశం ఉంటుంది. దేశంలో పండుగలూ ఉంటాయి. దేశ ప్రజలందరి శుభాకాంక్షలు, ఆదరాభిమానాలు మోసుకొని మీ మధ్యకొచ్చా.’’ అని ప్రధాని నరేంద్ర మోదీ సైనికులనుద్దేశించి వ్యాఖ్యానించారు.
హిమాలయ శిఖరాల్లో ఉన్నా... ఎడారిలో ఉన్నా, దట్టమైన అడువులు, లోతైన సముద్రాలు... ఇలా ఎక్కడ ఉన్నా శౌర్యంతో జవాన్లు పోరాడతారని, ఎదురయ్యే ప్రతి సవాల్‌లోనూ విజయం సాధిస్తూనే ఉంటున్నారని సైనికులపై ప్రశంసల వర్షం కురిపించారు. దేశ సరిహద్దుల వెంబడి ఉన్న అనేక పోస్టుల్లో ఎవరికైనా ఎక్కువ కాలం గుర్తుండే పోస్ట్ ‘లోంగేవాలా పోస్ట్’ అని, తరతరాలుగా ఈ లోంగేవాలా పోస్ట్ అందరికీ గుర్తుండి పోతుందని మోదీ పేర్కొన్నారు.
ఇక్కడే దాయాది పాకిస్తాన్‌కు భారత జవాన్లు దీటైన సమాధానం చెప్పారని, శత్రువులెవరూ దేశ జవాన్ల ముందు నిలబడలేరన్న గట్టి సంకేతాలను కూడా ఇక్కడి నుంచే పంపారని మోదీ గుర్తు చేశారు. ప్రతి భారతీయుడి గుండెల్లో శౌర్యాన్ని నింపే విధంగా సైనికులు ఈ పోస్ట్‌లో తమ పరాక్రమాన్ని చూపారని మోదీ ప్రశంసించారు. ‘‘ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన కొత్తల్లో దీపావళి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని సియాచిన్ ప్రాంతంలో పర్యటించాను. ఆ సమయంలో అందరూ నిబిడాశ్చర్యంలో మునిగిపోయారు. అయినా నా గురించి మీకు తెలుసు. ప్రతి పర్వదినాన్నీ నా సన్నిహితులతో జరుపుకుంటానని మీకు తెలుసు. ఈ సంవత్సరం కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాను.’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
సరిహద్దుల వెంట దేశం కోసం పనిచేస్తోన్న సైనికులందరి కుటుంబాలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలుపుతూ... వారందరికీ శిరస్సు వంచి నమస్కరించారు. దేశం సురక్షితంగా ఉందంటే సరిహద్దుల్లో రక్షణగా ఉన్న సైనికుల వల్లేనని, తీవ్రవాదంతో, ఉగ్రవాదంతో, దేశ ద్రోహులతో జవాన్లు పోరాడుతూ... దేశానికి రక్షణ కల్పిస్తున్నారని ఆయన ప్రశంసించారు. ఇతర దేశాలను అర్థం చేసుకోడానికే భారత్ మొదట ప్రాధాన్యం ఇస్తుందని, ఆ సమయంలో ఇతర దేశాలు కూడా భారత్‌ను అదే రీతిలో అర్థం చేసుకోవాలని హితవు పలికారు. ఈ సిద్ధాంతాన్ని పక్కనబెట్టి, దీనికి వ్యతిరేకంగా ఏ దేశం ప్రవర్తించినా భారత్ వారికి గట్టిగా బుద్ధి చెబుతుందని ప్రధాని మోదీ తీవ్రంగా హెచ్చరించారు.