Mumbai, Nov 15: మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యి ఈడీ విచారణ ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు ముంబై కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ సందర్భంగా తనకు రోజూ ఇంటి భోజనం తెప్పించుకునేందుకు అనుమతించాలని మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ (Maharashtra Ex-Home Minister AnIl Deshmukh) కోర్టును కోరారు. అయితే ఆయన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ముందుగా జైలు కూడు తినండి (Eat Jail Food First). ఒకవేళ తినలేకపోతే అప్పుడు మీ అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటామని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
అయితే, తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఒక బెడ్ ఏర్పాటు చేయాలన్న అనిల్ దేశ్‌ముఖ్ అభ్యర్థనను మాత్రం కోర్టు మన్నించింది. ఆయనకు కేటాయించిన గదిలో బెడ్ ఏర్పాటుకు అనుమతించింది. మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అనిల్ దేశ్‌ముఖ్‌ను ఈ నెల 2న ఈడీ అరెస్ట్ చేసింది. దాదాపు 12 గంటలపాటు ముంబైలోని ఈడీ ఆఫీసులో అనిల్ దేశ్‌ముఖ్‌ను ప్రశ్నించిన అనంరతం ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించింది. కాగా, మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ ఏడాది ప్రారంభంలోనే మంత్రి పదవికి రాజీనామా చేశారు.