Economic Package Highlights: రూ.లక్ష కోట్లతో రైతులకు ప్రత్యేక ప్యాకేజి, మూడో విడత ఆర్థిక ప్యాకేజీలో మొత్తం 11 అంశాలపై ప్రత్యేక దృష్టి, వెల్లడించిన కేంద్ర ఆర్థికమంత్రి
Nirmala Sitharaman (Photo Credits: ANI)

New Delhi, May 15:కోవిడ్ 19తో కుదేలైన దేశంలోని పలు రంగాలకు ఊతమిచ్చేలా ప్రధాని మోదీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీకి సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మూడో రోజు ప్రెస్‌మీట్ నిర్వహించారు.మూడో విడత ఆర్థిక ప్యాకేజీలో మొత్తం 11 అంశాలపై ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలిపారు.తాజాగా రైతులకు రూ.లక్ష కోట్లతో ప్రత్యేక ప్యాకేజి ప్రకటించారు. వలస కార్మికులకు 2 నెలలు ఉచిత భోజనం, 3 పూటల భోజనానికి రూ.3500 కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం, వివరాలను వెల్లడించిన ఆర్థిక మంత్రి సీతారామన్

వ్యవసాయ రంగ మౌలిక వసతుల కోసం రూ.లక్ష కోట్లతో నిధి ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.దేశంలో 85 శాతం వ్యవసాయ కమతాలు చిన్న, సన్నకారు రైతులవేనన్నారు. వర్షాభావం, వాతావరణ సమస్యలు అధిగమించి రైతులు శ్రమిస్తున్నారన్నారు. ధాన్యం, గోధుమల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించినట్లు తెలిపారు. జూట్‌ ఉత్పత్తిలో భారత్‌ అగ్రగామిగా ఉందన్నారు.

చెరుకు, పత్తి, వేరుశెనగ, పప్పుధాన్యాల ఉత్పత్తిలో మనం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నామన్నారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, మత్స్య, డెయిరీ, పప్పుధాన్యాలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఉత్పత్తులకు ప్యాకేజీని ప్రకటించారు. మత్స్య, డెయిరీ పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ కోసం 11 అంశాల్లో రాయితీలు ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు.

రోజుకు 560 లక్షల లీటర్ల పాల సేకరణ జరుగుతోందని, ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో భారత్ నంబర్ వన్ స్థానంలో ఉందని నిర్మల చెప్పారు. ఫసల్ బీమా యోజన కింద రూ.6400 కోట్లు చెల్లించామని తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో రైతుల నుంచి రూ.74,300 కోట్ల ధాన్యం కొనుగోలు చేశామని, పంట కొనుగోళ్లకు సంబంధించిన నగదు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామని నిర్మలా సీతారామన్ చెప్పారు.  రైతులకు మే 31 వరకు వడ్డీ రాయితీ, రైతులు,వలస కూలీలు,చిన్న వ్యాపారులకు ప్యాకేజీ ద్వారా ఎంతో లబ్ది, 9 విభాగాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి

స్థానిక వస్తువులకు అంతర్జాతీయ మార్కెట్‌ కల్పించాలన్న పీఎం మోదీ లక్ష్య సాధనకు అనుగుణంగా సూక్ష్మ ఆహార సంస్థలకు (మైక్రో ఫుడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌) రూ. 10 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. ఈ ప్యాకేజీతో రెండు లక్షల మైక్రో ఫుడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు లబ్ధి చేకూరనుంది. దీని ద్వారా ప్రజల ఆరోగ్య మెరుగుదల, సురక్షిత ప్రమాణాలు అభివృద్ధి, రిటైల్‌ మార్కెట్ల అనుసంధానం, ఆర్థిక రాబడుల పెంపును లక్షిస్తున్నట్లు తెలిపింది.

ఎంఎఫ్‌ఈలకు రూ. 10 వేల కోట్లు

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రమాణాలను అందుకునేందుకు వీలుగా ఎంఎఫ్‌ఈలను సాంకేతికంగా అభివృద్ధి చేయడం. బ్రాండ్లు కల్పించి మార్కెట్‌ సదుపాయాలు కల్పించడం. సూక్ష్మ ఆహార సంస్థలు, రైతు ఉత్పత్తి సంస్థలు, స్వయం సహాయక సంఘాలకు మద్దతు కల్పించడం. ప్రాంతానికి అనుగుణంగా ఉత్పత్తులను ప్రోత్సహించడం వంటివి ఈ పథకం కింద చేపట్టనున్నట్లు తెలిపారు.

మూడో విడత ప్యాకేజి వివరాలు...

రైతుల కోసం లక్ష కోట్లతో మౌలిక వసతుల కల్పన

వ్యవసాయ, అనుబంధ పరిశ్రమలకు స్వల్పకాలిక రుణాలు

వ్యవసాయానికి కేటాయించిన నిధుల నుంచి గోడౌన్లు, కోల్డ్ స్టోరేజిల నిర్మాణం

గ్రామీణ ఆహారోత్పత్తుల బ్రాండింగ్ కోసం ప్రత్యేక నిధి

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనకు రూ.20 వేల కోట్లు

రొయ్యసాగు, చేపల వేటకు రూ.11 వేల కోట్లు

ఫిషింగ్ హార్బర్లు, శీతల గిడ్డంగులకు రూ.9 వేల కోట్లు

వచ్చే ఐదేళ్లలో 70 లక్షల టన్నుల చేపల ఉత్పత్తికి ప్రణాళిక

మత్స్య పరిశ్రమలో 55 లక్షల మందికి ఉపాధి

లక్ష కోట్ల ఎగుమతులు లక్ష్యం

చేపల వేటపై నిషేధం అమలులో ఉన్న సమయంలో వ్యక్తిగత బీమాతో పాటు పడవలకు సైతం బీమా

పశువుల్లో వ్యాధుల నియంత్రణకు రూ.13,343 కోట్లు

పశువులు, గేదెలు, మేకలు, పందులు, గొర్రెలకు 100 శాతం వ్యాక్సినేషన్

వ్యవసాయం అనుబంధ రంగాలపై ప్యాకేజ్‌ ప్రకటన

మత్స్య, పశుసంవర్థక ,డెయిరీ , ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు ఊతం

మూడో విడత ప్యాకేజ్‌లో 11 అంశాలపై దృష్టి

వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కోసం రూ లక్ష కోట్లతో నిధి

కోల్డ్‌స్టోరేజ్‌లు, ధాన్యాల గిడ్డంగుల నిర్మాణం

లాక్‌డౌన్‌లో రైతుల ఖాతాల్లో రూ 18,700 కోట్ల నగదు బదిలీ

రైతుల నుంచి రూ 74,300 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు

డెయిరీ రైతులకు రూ 5వేల కోట్లతో అదనపు సాయం

2 కోట్ల మంది డెయిరీ రైతులకు లబ్ధి

రూ 30 వేల కోట్లతో రైతులకు అత్యవసర సహాయ నిధి

సహాయ నిధితో 3 కోట్ల మంది రైతులకు లబ్ధి

ఆక్వా రైతుల ఎగుమతుల కోసం ప్రత్యేక కార్యాచరణ

స్ధానిక ఉత్పత్తుల ఎగుమతుల కోసం రూ 10,000 కోట్లతో నిధి

చిన్నతరహా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సంస్ధల కోసం రూ 10,000 కోట్లతో నిధి

రెండు లక్షల ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు లబ్ధి

మత్స్య అనుబంధ రంగాలకు రూ 20,000 కోట్లు

మెరైన్‌ ఎగుమతుల పెంపునకు 55 లక్షల ఉద్యోగాలు

ఆక్వా కల్చర్‌కు రూ 11,000 కోట్లతో నిధి

ప్రధాని మత్స్యసంపద యోజన కింద రూ 20,000 కోట్లతో నిధి

మత్స్యకారులకు బీమా సౌకర్యం

పశుసంవర్ధక మౌలిక వసతులకు రూ 15,000 కోట్లు

పశువులు, జీవాలకు వ్యాక్సిన్‌ల కోసం రూ 13,300 కోట్లు

53 కోట్ల జీవాలకు నూరు శాతం వ్యాక్సినేషన్‌

ఔషధ మొక్కల సాగుకు రూ 4000 కోట్లతో నిధి

తేనెటీగల పెంపకందారులకు రూ 5000 కోట్లు

ధరల నియంత్రణకు నిత్యవసర చట్టంలో మార్పులు

లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశంలో నెలకొన్న సంక్షోభ నివారణకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రూ. 20 లక్షల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ విడుతలవారీగా ప్రకటిస్తున్నారు. ఇప్పటికే రెండు విడతలుగా ప్యాకేజీ వివరాలను ప్రకటించగా నేడు ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ మూడో విడత ప్యాకేజీ వివరాలను ప్రకటించారు.