New Delhi, Nov 5: వంటనూనె వినియోగదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. దేశంలో వంట నూనెల ధరల గణనీయంగా తగ్గాయని (Edible Oil Prices Declined) కేంద్ర ఆహార ప్రజాపంపిణీ విభాగం తెలిపింది. నూనె రకాన్ని బట్టి కిలోకు కనిష్ఠంగా రూ.7 నుంచి గరిష్ఠంగా రూ.20 వరకు తగ్గినట్లు ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డిపార్టుమెంట్ (Food and Public Distribution dept) కార్యదర్శి సుధాన్షు పాండే వెల్లడించారు. పామాయిల్, పల్లి నూనె, సోయాబీన్ నూనె, పొద్దుతిరుగుడు నూనెతోపాటు అన్ని ప్రధానమైన నూనె రకాలపై ధరలు తగ్గినట్లు తెలిపారు.
కాగా, కరోనా దేశంలో కాలుమోపిన అనంతరం కొండెక్కిన వంట నూనెల ధరలు.. ఇప్పుడిప్పుడే దిగి వస్తున్నాయి. 2020, మార్చిలో కిలో రూ.70-80 మధ్య ఉన్న వంట నూనెల ధరలు ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా కొండెక్కాయి. కిలో నూనె రూ.190-200 వరకు పలికింది. ఆ తర్వాత క్రమంగా దిగివచ్చి ప్రస్తుతం 150-160 మధ్య ఉన్నది. ఇప్పుడు ధరలు మరికాస్త తగ్గడంతో కిలో నూనె రూ.140కి అటుఇటుగా ఉండే అవకాశం ఉన్నది. దేశంలోని ప్రాంతాల్ని బట్టి ధరలు రూ.20, రూ.18,రూ.10,రూ.7లు తగ్గనున్నట్లు ఆయన (Sudhanshu Pandey) తెలిపారు.
అయితే మార్కెట్లో మండిపోతున్న వంట నూనెల ధరలపై కేంద్రం అక్టోబర్‌లోనే కీలక నిర్ణయం తీసుకుంది. పన్నులు తగ్గించినా వంట నూనె ధరలు తగ్గకపోవడంతో వినియోదారులపై భారాన్ని తగ్గించేలా వ్యాపారుల వద్ద ఉన్న వంట నూనెలు, నూనె గింజల నిల్వలపై మార్చి 31, 2022 వరకు పరిమితి విధించింది. ఆహార, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్‌మెంట్ ఈ వస్తువులపై స్టాక్ పరిమితులను తక్షణమే అమల్లోకి తీసుకురావాలని ఆదేశించింది. తాజాగా ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డిపార్టుమెంట్ స్టాక్ పరిమితులను అమల్లోకి తీసుకురావడంతో వంటనూనెలల ధరలు తగ్గాయి.