New Delhi, June 23: బ్యాంకులను మోసగించి, పరారైన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల (Mehul Choksi, Nirav Modi, Vijay Mallya) నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులను ప్రభుత్వ రంగ బ్యాంకులకు, కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) (Enforcement Directorate)ప్రకటించింది. రూ.9,371.17 కోట్ల విలువైన ఆస్తులను బదిలీ చేసినట్లు బుధవారం ఇచ్చిన ట్వీట్‌లో వివరించింది.
అంతేకాదు ఈ ముగ్గురికి చెందిన సుమారు రూ.18,170.02 కోట్ల ఆస్తులను సీజ్ చేసినట్లు ఈడీ చెప్పింది. దీంట్లో విదేశాల్లో ఉన్న రూ.969 కోట్ల ఆస్తులు కూడా ఉన్నాయి. ముగ్గురి వల్ల బ్యాంకులకు జరిగిన నష్టంలో వారి ఆస్తులు అటాచ్ చేసి, సీజ్ చేసిన మొత్తం విలువ 80.45 శాతంగా ఉన్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ చెప్పింది.
వ్యాపారవేత్తలు విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు.. భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగవేసిన విషయం తెలిసిందే. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యాలు.. ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. వారిని ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ ముగ్గురూ భారతీయ బ్యాంకుల నుంచి సుమారు రూ.22,585 కోట్లు రుణం తీసుకున్నారు. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ ముగ్గురికి చెందిన లావాదేవీలను సమీక్షించింది.
డమ్మీ సంస్థలతో ఈ ముగ్గురు బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో రుణాలు తీసుకున్నట్లు ఈడీ చెప్పింది. విజయ్ మాల్యాను అప్పగించేందుకు బ్రిటన్ కోర్టు అంగీకరించింది. భారత దేశానికి అప్పగించడానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అపీలు చేయడానికి మాల్యాకు అనుమతి లభించలేదు.ముగ్గురికి చెందిన ఆస్తులను త్వరలో వేలం వేయనున్నారు. దాని ద్వారా ఆయా బ్యాంకులకు సుమారు రూ.7981 కోట్లు జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల నుంచి రూ.18,170.02 కోట్లు స్వాధీనం చేసుకోవడం మాత్రమే కాకుండా, దీనిలో కొంత భాగం అంటే రూ.9,371.17 కోట్లను ప్రభుత్వ రంగ బ్యాంకులకు, కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసినట్లు తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు జరిగిన నష్టంలో 80.45 శాతం విలువగల ఆస్తులను జప్తు చేసినట్లు తెలిపింది.
Here's ED Tweet
ED not only attached/ seized assets worth of Rs. 18,170.02 crore (80.45% of total loss to banks) in case of Vijay Mallya, Nirav Modi and Mehul Choksi under the PMLA but also transferred a part of attached/ seized assets of Rs. 9371.17 Crore to the PSBs and
Central Government.
— ED (@dir_ed) June 23, 2021
విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులను మోసం చేసినట్లు గతంలో కేసులు నమోదయ్యాయి. వీరు తాము ఏర్పాటు చేసిన కంపెనీల ద్వారా నిదులను దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. వీరు చేసిన మోసాల కారణంగా బ్యాంకులకు రూ.22,585.83 కోట్లు నష్టం వాటిల్లింది. సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది.
బ్యాంకులు ఇచ్చిన నిధులను తమ కంపెనీల ద్వారా వీరు రొటేషన్, దారి మళ్లింపులకు పాల్పడినట్లు ఎఫ్ఐఆర్‌లు పేర్కొంటున్నాయి. ఈ ముగ్గురినీ తిరిగి మన దేశానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు ఈడీ తెలిపింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం దర్యాప్తు పూర్తి కాగానే ఈ ముగ్గురినీ మన దేశానికి రప్పించడానికి బ్రిటన్, ఆంటిగ్వా, బార్బుడాలకు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొంది. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా పరారైన ఆర్థిక నేరగాళ్ళు అని ముంబైలోని మనీలాండరింగ్ నిరోధక న్యాయస్థానం ప్రకటించింది.