New Delhi, May 27: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. తన బిడ్డను మామ లైంగికంగా వేధించాడని కోడలు ఫిర్యాదు చేయడంతో ఉత్తరాఖండ్ మాజీ మంత్రి రాజేంద్ర బహుగుణ (Rajendra Bahuguna) తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఉత్తరాఖండ్ మాజీ మంత్రి రాజేంద్ర బహుగుణ(59) తన బిడ్డను లైంగికంగా వేధిస్తున్నట్లు ఆయన కోడలు ఆరోపణలు చేసింది. అంతే కాదు.. పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. మాజీ మంత్రిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదు చేశారు. ఈ పరిణామాల మధ్య బహుగుణ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. బుధవారం ఉదయం రాజేంద్ర బహుగుణ తన సొంతూరు హల్ద్‌వానిలో ఓ వాటర్ ట్యాంక్ ఎక్కారు.
తనపై తన కోడలు తప్పుడు ఆరోపణలు చేసిందని, తీవ్ర మనస్తాపానికి గురయ్యానని ఆయన పేర్కొన్నారు. ఇక తాను బతకదలచుకోలేదని, ఆత్మహత్య (Ex-Uttarakhand Minister Rajendra Bahuguna Kills Himself) చేసుకుంటున్నానని ఎమర్జెన్సీ నంబర్ 112కు బహుగుణ డయల్ చేసి చెప్పారు. దీంతో అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు వాటర్ ట్యాంక్ వద్దకు చేరుకున్నారు. ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడకుండా కిందకు దిగి రావాలని మాజీ మంత్రిని పోలీసులు వేడుకున్నారు. అయితే పోలీసుల విజ్ఞప్తి మేరకు కిందకు దిగే ప్రయత్నం చేశారు.
కానీ అంతలోనే తన ఛాతీపై మాజీ మంత్రి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మాజీ మంత్రి రాజేంద్ర బహుగుణ కుమారుడు అజయ్ బహుగుణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మాజీ మంత్రి ఆత్మహత్య కేసులో ఆయన కోడలితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.