New Delhi, Feb 2: ఆమ్ ఆద్మీపార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు మరోసారి గైర్హాజరు కానున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఈడీ నోటీసులను అక్రమం, చట్టవిరుద్దమని పేర్కొంటూ విచారణకు హాజరు కాకూడదని కేజ్రీవాల్ నిర్ణయించుకున్నారు. కాగా లిక్కర్ కేసులో గత నాలుగు నెలల్లో నాలుగుసార్లు తమ ఎందుట విచారణకు హాజరు కావాలంటూ కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే ప్రతిసారి ఆయన విచారణకు హాజరు కాలేదు.
శుక్రవారం విచారణకు హాజరు కావాలని బుధవారం మరోసారి ఈడీ సమన్లు పంపింది. ఈ నోటీసులకు సైతం కేజ్రీవాల్ హాజరు కాలేదు. అయితే ఈడీ పదేపదే నోటీసులు జారీ చేయడం వెనక కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తుంది. కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయడమే ప్రధాని మోదీ లక్ష్యమని, దీని ద్వారా ఢిల్లీ ప్రభుత్వాన్నిపడగొట్టాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించింది. నవంబర్ 1న తొలిసారి ఢిల్లీ సీఎంకు ఈడీ సమన్లు జారీ చేసింది. తరువాత డిసెంబర్ 21, ఈ ఏడాది జనవరి 3, జనవరి 18న నోటీసులు ఇవ్వగా.. రాజకీయ కక్ష అంటూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వాటిని పరిగణలోకి తీసుకోవడం లేదు.