New Delhi, Jan 28: కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న శాంతియుత ఉద్యమాన్నినటుడు దీప్ సిద్ధూ వంటి సంఘ విద్రోహ శక్తులు హింసాత్మకంగా మార్చేందుకు కుట్ర పన్నారని సంయుక్త కిసాన్ మోర్చా ఆరోపించింది. రైతుల పోరాటాన్ని దెబ్బతీసేందుకు ప్రభుత్వం, ఇతర శక్తులు చేస్తున్న ప్రయాత్నాలను సఫలం కానీయబోమని స్పష్టంచేసింది. ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణకు దీప్ సిద్ధూ, కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీనే కారణమని పేర్కొంది.
తాము చేస్తున్న పోరాటంలో వారు భాగస్వాములు కాదని తెలిపింది. రైతుల శాంతియుత నిరసనలతో కేంద్రంలో వణుకుపుట్టిందని, ఈ నేపథ్యంలోనే కిసాన్ మజ్దూర్, ఇతర శక్తులతో కలిసి కుట్ర పన్నారని (Republic Day violence) పేర్కొన్నది. రైతులు సరిహద్దుల్లోనే ఉండి శాంతియుత నిరసనలు కొనసాగించాలని సూచించింది. కాగా, ట్రాక్టర్ ర్యాలీలో హింస నేపథ్యంలో వచ్చే నెల 1న (Farmers cancel Feb 1 Parliament march) నిర్వహించాల్సిన పార్లమెంట్ మార్చ్‌ను రద్దు చేస్తున్నట్టు రైతు నేతలు ప్రకటించారు. 30న గాంధీజీ వర్ధంతి సందర్భంగా నిరాహార దీక్ష చేపడుతామన్నారు.
ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో చెలరేగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఉద్యమం నుంచి వైదొలగుతున్నట్టు రెండు రైతు సంఘాలు భారతీయ కిసాన్ యూనియన్ (భాను వర్గం) (Kisan Union), ఆలిండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ (ఏఐకేఎస్‌సీసీ) ప్రకటించాయి.
కాగా రైతుల ట్రాక్టర్ ర్యాలీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు 25 ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేశారు. ఇప్పటివరకు 19 మందిని అరెస్ట్ చేశారు. 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. రాకేశ్ తికాయత్ వంటి రైతు నేతలతోపాటు, యోగేంద్ర యాదవ్, మేధాపాట్కర్ తదితర సామాజిక కార్యకర్తల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో నమోదుచేశారు. ఘర్షణల్లో 394 మంది పోలీసులు గాయపడినట్టు అధికారులు తెలిపారు. నూతన సాగు చట్టాలకు (New Farm laws) వ్యతిరేకంగా హర్యానాలోని ఐఎన్‌ఎల్డీ పార్టీ ఏకైక ఎమ్మెల్యే అభయ్ సింగ్ చౌతాలా మంగళవారం రాజీనామా చేశారు.
రైతులతో చర్చలకు ద్వారాలు మూసుకుపోయినట్టు తామెప్పుడూ చెప్పలేదని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. తదుపరి చర్చలు ఎప్పుడనేది తెలియజేస్తామని చెప్పారు. ఎర్రకోటపై జాతీయజెండాకు జరిగిన అవమానాన్ని దేశ ప్రజలు ఉపేక్షించబోరన్నారు. రైతుల ర్యాలీ సందర్భంగా చెలరేగిన హింసపై దర్యాప్తు చేపట్టేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటుచేయాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. హింసకు బాధ్యులైనవారిపైనా, జాతీయ జెండాను అగౌరవపరిచినవారిపైనా ఎఫ్‌ఐఆర్ నమోదుచేసేలా ఆదేశాలివ్వాలని న్యాయవాది విశాల్ తివారీ పిటిషన్ దాఖలు చేశారు.