Farmers' protest: ఢిల్లీలో హింస, జనవరి 31వ తేదీ వరకు మళ్లీ ఎర్రకోట మూసివేత, ఉత్తర్వులు జారీ చేసిన పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా, పార్లమెంట్ మార్చ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన రైతులు
Red Fort Complex/Photo Credits: Pixabay

New Delhi, Jan 28: కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాల రద్దును కోరుతూ రైతులు తలపెట్టిన రిపబ్లిక్ డే ట్రాక్టరు పరేడ్ సందర్భంగా దేశ రాజధానిలో భారీ హింస (R-Day violence) చోటు చేసుకున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా ఎర్రకోటపై జాతీయ జెండాకు బదులుగా వేరే జెండాను నిలబెట్టారు. దీంతో అలర్ట్ అయిన కేంద్ర ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. ఎర్రకోటను జనవరి 31వతేదీ వరకు (Red Fort to remain closed) మూసివేశారు. ఈ మేరకు పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీ చేసింది.

ఆయా రోజుల్లో ఎర్రకోటలోకి పర్యాటకులకు అనుమతి ఉండదని పేర్కొంది. అయితే మూసివేతకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఇటీవల ఢిల్లీలో బర్డ్‌ఫ్లూ హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు చారిత్రక ప్రదేశాన్ని మూసివేశారు. అలాగే గణతంత్ర దినోత్సవం సందర్భంగా 22వ తేదీ నుంచి 26 మూసివేశారు. 27వ తేదీ నుంచి మళ్లీ సందర్శకులకు అనుమతి ఇవ్వాల్సి ఉండగా.. ఈ నెల 31 వరకు మూసివేస్తూ పురాతత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, రిపబ్లిక్‌ డే రోజున వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతు సంఘాలు నిర్వహించిన పరేడ్‌ హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో ఓ యువరైతు బలయ్యాడు.

రైతులు ఎర్రకోటలో మెటల్ డిటెక్టరును ధ్వంసం (Farmers Protest) చేశారు. రైతుల దాడిలో రెడ్ ఫోర్టు కాంప్లెక్సు దెబ్బతింది. యునెస్కో గుర్తింపు పొందిన ఎర్రకోటలో రైతులపై భద్రతాదళాలు విరుచుకుపడ్డాయి. ఆందోళనకారులు ఎర్రకోటను ముట్టడించి ఆధ్యాత్మిక జెండాలను ఎగురవేశారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హింసాకాండ అనంతరం జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకే ఎర్రకోటను మూసివేసినట్లు పురావస్తు శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

బుధవారం సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌ చారిత్రక ప్రదేశాన్ని సందర్శించి, నష్టాన్ని అంచనా వేసి నివేదిక అందజేయాలని ఏఎస్‌ఐని ఆదేశించారు. ఈ మేరకు చారిత్రక ప్రదేశాన్ని మూసివేసినట్లు తెలుస్తోంది. రైతుల ఆందోళన సందర్భంగా ఎర్రకోటలో మెటల్‌ డిటెక్టర్లు, టికెట్‌ కౌంటర్లు, అద్దాలు ధ్వంసమయ్యాయి. ఢిల్లీలో 173 స్మారక చిహ్నాలు భారత పురావస్తు సర్వే (ఏఎస్‌ఐ) ఆధీనంలో ఉన్నాయి. ఇందులో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో ఎర్రకోట, హుమాయున్ టూంబ్‌, కుతుబ్ మినార్ ఉన్నాయి.

రైతు ఉద్యమంలో చీలికలు, ఈ నిరసన నుంచి తప్పుకుంటున్నామని తెలిపిన ఏఐకేఎస్‌సీసీ, శాంతియుత నిరసన కొనసాగిస్తామని తెలిపిన వీఎం సింగ్, రాకేష్ తికాయత్‌తో సహా 200 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న శాంతియుత ఉద్యమాన్ని నాశనం చేసేందుకు నటుడు దీప్‌ సిద్ధూ వంటి సంఘ విద్రోహ శక్తులు కుట్ర పన్నాయని సంయుక్త కిసాన్‌ మోర్చా ఆరోపించింది. పోరాటాన్ని దెబ్బతీసేందుకు ప్రభుత్వం, ఇతర శక్తులు చేస్తున్న ప్రయాత్నాలను సఫలం కానీయబోమని స్పష్టంచేసింది. ట్రాక్టర్‌ ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణకు దీప్‌ సిద్ధూ, కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ కమిటీనే కారణమని పేర్కొంది. తాము చేస్తున్న పోరాటంలో వారు భాగస్వాములు కాదని తెలిపింది.

రైతుల శాంతియుత నిరసనలతో కేంద్రంలో వణుకుపుట్టిందని, ఈ నేపథ్యంలోనే కిసాన్‌ మజ్దూర్‌, ఇతర శక్తులతో కలిసి కుట్ర పన్నారని పేర్కొన్నది. రైతులు సరిహద్దుల్లోనే ఉండి శాంతియుత నిరసనలు కొనసాగించాలని సూచించింది. కాగా, ట్రాక్టర్‌ ర్యాలీలో హింస నేపథ్యంలో వచ్చే నెల 1న నిర్వహించాల్సిన పార్లమెంట్‌ మార్చ్‌ను రద్దు చేస్తున్నట్టు రైతు నేతలు ప్రకటించారు. 30న గాంధీజీ వర్ధంతి సందర్భంగా నిరాహార దీక్ష చేపడుతామన్నారు.