Farmers Protest in Burari Ground. (Photo Credits: ANI | Twitter)

New Delhi, June 12: కేంద్రం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు గతేడాది నవంబరు 26 నుంచి దిల్లీ సరిహద్దుల్లో బైఠాయించి ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఉద్యమం సుప్రీంకోర్టుకు చేరడంతో సాగు చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేసింది. నూతన చట్టాలపై కేంద్రం, రైతుల మధ్య పలు మార్లు చర్చలు జరిగినప్పటికీ అవి ఫలించలేదు. చట్టాల్లో సవరణలు తీసుకొస్తామని కేంద్రం ప్రతిపాదించగా.. పూర్తిగా రద్దు చేయాలని రైతు నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

కాగా నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఉద్యమానికి (Farmers Protest) ఏడు నెలలు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 26న ‘రాజ్‌భవన్ల ముట్టడి’కి (Agitating Farmers To Protest at Raj Bhavans) రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఆ రోజున అన్ని రాష్ట్రాల్లోని గవర్నర్ల నివాసాలైన రాజ్‌భవన్‌ల ముందు ధర్నాలు చేపడతామని వెల్లడించాయి. ఆరోజు ‘సేవ్‌ ఫార్మింగ్‌, సేవ్‌ డెమోక్రసీ’ దినంగా పాటించనున్నట్లు వెల్లడించింది. నల్లజెండాలతో ధర్నాలో పాల్గొని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వినతి పత్రాలను పంపిస్తామని సంయుక్త కిసాన్‌మోర్చా నాయకుడు ఇంద్రజిత్‌ సింగ్‌ తెలిపారు.

కరోనా సెకండ్ వేవ్‌తో ఏకంగా 719 మంది వైద్యులు మృతి, దేశంలో కొత్తగా 84,332 కరోనా కేసులు, 4002 మంది మృతితో 3,67,081కు పెరిగిన మరణాల సంఖ్య

‘‘1975 జూన్‌ 26న దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇప్పుడూ అలాంటి పరిస్థితే నెలకొంది. ఇది అప్రకటిత ఎమర్జెన్సీ. ఈ జూన్‌ 26 నాటికి మేం ఉద్యమం చేపట్టి 7 నెలలు పూర్తికావస్తుంది. అందుకే ఆ రోజును సేవ్‌ ఫార్మింగ్‌, సేవ్‌ డెమొక్రసీ (వ్యవసాయాన్ని కాపాడుదాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం) డేగా పాటించాలని నిర్ణయించాం’’ అని ఇంద్రజిత్‌ సింగ్‌ తెలిపారు. ఆ రోజున అన్ని రాజ్‌భవన్‌ల ముందు నల్ల జెండాలో ధర్నా చేయనున్నట్లు వెల్లడించారు.

రైతుల సంక్షేమమే థ్యేయమంటూ కేంద్ర ప్రభుత్వం నూతన సాగు చట్టాలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వీటిని వ్యతిరేకిస్తూ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించిన విషయం తెలిసిందే. జనవరి 26న పరిస్థితులు విపరీత పరిణామాలకూ దారి తీశాయి. అయినా రైతులు మాత్రం తమ తమ ప్రాంతాల్లో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.