New Delhi, June 12: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు (Covid in India) నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి (Coronavirus in India) చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది (Covid Deaths) మరణించారు. గత 24 గంటల్లో 1,21,311 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు 2,79,11,384 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 10,80,690 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 24.96 కోట్ల మందికిపైగా వ్యాక్సినేషన్ జరిగింది. దేశ వ్యాప్తంగా కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,67,081గా ఉంది.
కొవిడ్ సెకండ్ వేవ్ ధాటికి సామాన్య ప్రజలతో పాటు కొవిడ్ బాధితులకు చికిత్స అందించిన అనేక మంది వైద్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు. సెకండ్ వేవ్‌లో దేశవ్యాప్తంగా 719 మంది వైద్యులు మృతి చెందారు. బీహార్ రాష్టంలో గరిష్టంగా 111 మంది డాక్టర్లు మృతి చెందగా... ఢిల్లీలో 109 మంది మృతి చెందారు. ఉత్తప్రదేశ్‌లో 79 మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారు. వెస్ట్ బెంగాల్‌లో 63 మంది వైద్యులు, రాజస్థాన్‌లో 43 మంది వైద్యులు, తెలంగాణలో 36 మంది వైద్యులు, ఏపీలో 35 మంది వైద్యులు, గుజరాత్‌లో 37 మంది డాక్టర్లు మృతి చెందినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధికారికంగా ప్రకటించింది.
కొవిడ్ సోకిన వారిలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలతో (ప్రతిరక్షకాలు) పోలిస్తే, వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో ఉత్పత్తి అయ్యే యాంటిబాడీలు శక్తిమంతమైనవని ఉత్తరప్రదేశ్‌లోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ (కేజీఎంయూ) అధ్యయనంలో తేలింది. అలాగే, వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో ప్రతిరక్షకాలు ఎక్కువ కాలం ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. 989 కేజీఎంయూ హెల్త్‌కేర్ వర్కర్లు, 500 మంది ప్లాస్మా దాతలపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడైనట్టు చెప్పారు. వైరస్ గొలుసును విచ్చిన్నం చేయడానికి సాయపడే హెర్డ్ ఇమ్యూనిటీ (సమూహ రోగనిరోధక శక్తి) సాధించాలంటే పెద్దఎత్తున వ్యాక్సినేషనే పరిష్కారమని పేర్కొన్నారు.
తమిళనాడులో కరోనా తీవ్రత కొనసాగుతున్నది. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 15,759 వైరస్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మరో 378 మంది కరోనాతో మరణించారు. దీంతో ఆ తమిళనాడులో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,24,597కు, మొత్తం మరణాల సంఖ్య 28,906కు చేరింది. ప్రస్తుతం 1,74,802 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తమిళనాడులో కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను ఈనెల 21 వరకూ పొడిగించారు.
అయితే లాక్‌డౌన్ ఆంక్షలను సడలించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మద్యం షాపులకు అనుమతిస్తారు. చెన్నైతో సహా 27 జిల్లాల్లో సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, స్పాలను ఎయిర్ కండిషన్లు లేకుండా 50 శాతం కస్టమర్లతో సాయంత్రం 5 గంటలకు వరకూ అనుతిస్తామని ప్రభుత్వం పేర్కొంది. టాక్సీలు, ఆటోలు నడుస్తాయని వెల్లడించింది. అలాగే ప్రభుత్వ పార్కులు ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకూ తెరుస్తారు.
కరోనా కేసుల కట్టడికి విధించిన లాక్‌డౌన్ సత్ఫలితాలు ఇస్తోందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. నియంత్రణలతో కొవిడ్-19 కేసుల సంఖ్య తగ్గడంతో పాటు వైరస్ వ్యాప్తి రేటు కూడా దిగివస్తోందని చెప్పారు. శని, ఆదివారాల్లో విధించే వారాంతపు లాక్‌డౌన్ కు ప్రజలు సహకరించాలని కోరారు. వారాంతపు లాక్‌డౌన్ లో కేవలం నిత్యావసరాల దుకాణాలు, అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఉంటుందని చెప్పారు. ఇక కేరళలో తాజాగా 14,233 పాజిటివ్ కేసులు నమోదవగా మహమ్మారి బారినపడి 173 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 15,355 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మరోవైపు కరోనా లాక్‌డౌన్ ను ఈనెల 16 వరకూ పొడిగించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది.