New Delhi, Feb 3: రిపబ్లిక్ దినోత్సవం 2021 రోజున ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా జరిగిన హింసపై దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్లపై విచారణ జరపలేమని ఎలాంటి జోక్యం చేసుకోమని తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) మాట్లాడుతూ, చట్టం తన పని తాను చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ ఒక ప్రకటనలో చెప్పారు, అటువంటి పరిస్థితిలో మేము జోక్యం చేసుకోవాలనుకోవడం లేదని అన్నారు.
కాగా జనవరి 26 న ట్రాక్టర్ ర్యాలీ (Tractor Rally Violence) సందర్భంగా జరిగిన హింసపై న్యాయ విచారణ జరపాలని కోరుతూ పిటిషన్లు వినడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు (Supreme Court) పిటిషనర్లను ప్రభుత్వానికి మెమోరాండం సమర్పించాలని కోరింది. సున్నితమైన అంశంలో కేంద్రం చట్టపరంగా స్పందిస్తుందని సుప్రీం కోర్టు సూచించింది. ఈ సందర్భంగా పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని సీజేఐ సూచించారు.
అలాగే ఎలాంటి ఆధారాలు లేకుండా రైతులను ఉగ్రవాదులుగా చిత్రీకరించే ‘తప్పుడు ఆరోపణలు, చర్యలను’ ప్రచారం చేయకుండా అధికారులను, మీడియాకు ఆదేశాలు జారీ చేయాలని దాఖలైన పిల్‌ను సైతం సుప్రీం కోర్టు కొట్టివేసింది. ప్రభుత్వం ఇప్పటికే ఈ విషయంలో విచారణ జరుపుతోందని, ఈ మేరకు సదరు మంత్రిత్వశాఖను సంప్రదించాలని సూచించింది.
మరోవైపు, రిపబ్లిక్ దినోత్సవం 2021 నాడు ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా హింసకు సంబంధించి పలు 'తప్పుదోవ పట్టించే' ట్వీట్లను ట్వీట్ చేసినందుకు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, ఇతరులపై నోయిడా పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన సంగతి విదితమే. ఈ ఎఫ్‌ఐఆర్‌లకు వ్యతిరేకంగా జర్నలిస్టులు రాజ్‌దీప్ సర్దేసాయ్, మృణాల్ పాండే, జాఫర్ ఆఘా, పరేష్ నాథ్, అనంత్ నాథ్ మంగళవారం సాయంత్రం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ పరేడ్ (Tractor Rally) సందర్భంగా హింస గురించి తప్పుగా ట్వీట్ చేసినందుకు మధ్యప్రదేశ్ పోలీసులు కూడా థరూర్ మరియు ఆరుగురు జర్నలిస్టులపై కేసు నమోదు చేశారు.
కేంద్రంలోని మూడు కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలన్న డిమాండ్‌కు అనుకూలంగా జనవరి 26 న వేలాది మంది రైతులు 'ట్రాక్టర్ పరేడ్' చేపట్టారు. ఇది హింసకు దారి తీసింది. చాలా చోట్ల నిరసనకారులు పోలీసు బారికేడ్లను పగలగొట్టారు. పోలీసులతో కూడా ఘర్షణ పడ్డారు. వేలాది మంది రైతులు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను బద్దలు కొట్టి చొచ్చుకురావడంతో పాటు పోలీసులపై సైతం దాడికి దిగారు. ఎర్రకోటలో మతానికి సంబంధించిన జెండాలను ఎగుర వేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తునకు సర్వోన్నత న్యాయస్థానం విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయాలంటూ న్యాయవాది విశాల్ తివారి సైతం పిటిషన్ వేశారు. ర్యాలీలో జాతీయ జెండాను అవమానించిన వ్యక్తులు, సంస్థలపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరారు. మరోవైపు ఎలాంటి ఆధారాలు లేకుండా రైతులను ఉగ్రవాదులుగా ముద్ర వేయకుండా అధికారులకు, మీడియాకు ఆదేశాలివ్వాలంటూ మనోహర్‌లాల్ శర్మ అనే మరో న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. రైతుల నిరసనను దెబ్బతీసేందుకు ప్రణాళికబద్దమైన కుట్ర జరిగిందని ఆయన పిటిషన్‌లో ఆరోపించారు.